Corona: వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే మా రాష్ట్రంలోకి రానిస్తాం!

వచ్చే 64 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని కేంబ్రిడ్జ్‌ అధ్యయనం అంచనా వేస్తున్న తరుణంలో ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలకు తోడు ఈ కొత్త ఆంక్షలను సీఎం ప్రకటించారు.....

Published : 14 Aug 2021 16:45 IST

చండీగఢ్‌: దేశంలో ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో ఇప్పటికే అదుపులోకి వచ్చిన కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా బయటి రాష్ట్రాల నుంచి పంజాబ్‌ వచ్చే ప్రజలపై ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. పూర్తిగా వ్యాక్సినేషన్‌ అయిన వారిని లేదంటే ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారిని మాత్రమే పంజాబ్‌లోకి అనుమతించనున్నట్టు స్పష్టంచేశారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ నుంచి వచ్చే ప్రజలపై గట్టి నిఘా ఉంచాలని రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. 

వచ్చే 64 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని కేంబ్రిడ్జ్‌ అధ్యయనం అంచనా వేస్తున్న తరుణంలో ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలకు తోడు ఈ కొత్త ఆంక్షలను సీఎం ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివిటీరే పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో వచ్చే వాళ్లందరికీ ఈ కొత్త ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.

పంజాబ్‌లో ఇటీవల పాఠశాలలు తెరవడంతో దాదాపు 40మందికి పైగా చిన్నారులు వైరస్‌ బారినపడటంపై సీఎం స్పందించారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన బోధన, బోధనేతర సిబ్బందిని మాత్రమే పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక తరగతులకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారిని కూడా అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. పిల్లలందరికీ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రోజూ 10వేల శాంపిల్స్‌ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది నుంచి సేకరించాలని ఆదేశించారు. 

పంజాబ్‌లో నిన్న 89కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటివరకు అక్కడ 5,99,846 కేసులు నమోదు కాగా.. 16,334మంది ఈ మహమ్మారి కాటుకు బలైపోయారు. ప్రస్తుతం అక్కడ 568 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని