Afghanistan: 350 మంది తాలిబన్లను మట్టుబెట్టాం!

పర్వాన్‌ ప్రాంతంలో పంజ్‌షిర్‌కు చెందిన నేతలు, గిరిజన తెగలతో జరిపిన ఈ చర్చలు విఫలమైనట్టు తాలిబన్ల ప్రతినిధి ముల్లా అమిర్‌ ఖాన్‌ ముత్తాకి మీడియాకు వెల్లడించారు. పంజ్‌షిర్‌ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేశారు......

Updated : 01 Sep 2021 21:43 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తమ స్వాధీనంలోకి రాని ఏకైక ప్రాంతం పంజ్‌షిర్‌ కోసం తాలిబన్లు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఏకఛత్రాధిపత్యానికి కొరకరాని కొయ్యగా మారిన ఆ ప్రాంతాన్ని ఎలాగైనా తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు వారు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి. అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు.. పంజ్‌షిర్‌ను కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ఆ ప్రాంతం నేతలతో బుధవారం చర్చలు జరిపారు. పర్వాన్‌ ప్రాంతంలో పంజ్‌షిర్‌కు చెందిన నేతలు, గిరిజన తెగలతో జరిపిన ఈ చర్చలు విఫలమైనట్టు తాలిబన్ల ప్రతినిధి ముల్లా అమిర్‌ ఖాన్‌ ముత్తాకి మీడియాకు వెల్లడించారు. పంజ్‌షిర్‌ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పంజ్‌షిర్‌ లోయ ప్రజలే వారిని ఒప్పించాలని తాలిబన్లు సూచిస్తున్నారు.

350మంది తాలిబన్లను మట్టుపెట్టాం.. ఉత్తరకూటమి

మరోవైపు, తాలిబన్లను పంజ్‌షిర్‌ దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షిర్‌ను ఎలాగైనా వశం చేసుకొనేందుకు అక్కడ అడుగు పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో తాలిబన్లు వందల సంఖ్యలో తమ ఫైటర్లను కోల్పోయారు. నిన్న రాత్రి ఖవాక్‌ వద్ద జరిగిన యుద్ధంలో సహా ఇప్పటివరకు 350 మంది తాలిబన్‌ ఫైటర్లను మట్టుబెట్టినట్టు ఉత్తర కూటమి దళాలు ప్రకటించాయి. మరో 40మందికి పైగా తాలిబన్‌ ఫైటర్లను పట్టుకొని ఖైదు చేసినట్టు ట్విటర్‌లో తెలిపింది.

పశ్చిమదేశాల బలగాలు విమానాశ్రయాన్ని ధ్వంసంచేశాయి..

అఫ్గాన్‌ నుంచి ప్రజల తరలింపు నేపథ్యంలో పశ్చిమ దేశాల సైన్యాలు కాబుల్‌ విమానాశ్రయాన్ని ధ్వంసం చేశాయని తాలిబన్‌ నేత అనాస్‌ హక్కానీ అన్నారు.  దీంతో విమానాశ్రయానికి పాత వైభవాన్ని తీసుకొచ్చేలా పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. త్వరలోనే ఇక్కడి నుంచి రాకపోకలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని