సాగు చట్టాలు..చర్చలకు ద్వారాలు మూసుకుపోలేదు!

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్చలు జరిపేందుకు ద్వారాలు మూసుకుపోలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పష్టంచేశారు.

Published : 27 Jan 2021 21:32 IST

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌

దిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో చర్చలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్చలు జరిపేందుకు ద్వారాలు మూసుకుపోలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పష్టంచేశారు. ‘వ్యవసాయ చట్టాలపై రైతులతో సంప్రదింపులకు ద్వారాలు మూసుకుపోయాయని మేము ఎన్నడూ చెప్పలేదు. రైతులతో చర్చలు ఎప్పుడు జరిపినా మీకు తెలియజేస్తాం’ అని కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ విలేకరులకు వెల్లడించారు. ఇక రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, దిల్లీ ఉద్రిక్తతలకు బాహ్య శక్తుల వైఖరే కారణమని ఆరోపించారు.

సాగు చట్టాల అమలును సంవత్సరం నుంచి ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో 11వ దఫా జరిపిన చర్చల్లోనూ రైతు సంఘాలు ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి. ఈ ప్రతిపాదన ఉత్తమమైందని.. దీనిపై రైతులు పునరాలోచించుకోవాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే, దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే గణతంత్ర దినోత్సవం నాడు రైతు సంఘాలు దిల్లీలో భారీ ర్యాలీ చేపట్టాయి. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా, పలుచోట్ల హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు-ప్రభుత్వం నడుమ మరోసారి చర్చలు జరుగుతాయా? అన్న ప్రశ్నలు మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ద్వారాలు మూసుకుపోలేదని తెలిపింది.

ఇదిలాఉంటే, వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టిన 41 రైతు సంఘాల నుంచి తాజాగా రెండు సంఘాలు తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి. దిల్లీ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కిసాన్‌ మజ్ధూర్‌ సంఘటన్‌, బీకేయూలోని ఓవర్గం ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాయి.

ఇవీ చదవండి..
ఎర్రకోటపై రైతన్న జెండా
సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయి: రైతు సంఘాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని