Mohan Charan Majhi: నా భర్త సీఎం అని.. టీవీలో వచ్చాకే తెలిసింది..!

ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రి ఎన్నికైన మోహన్‌చరణ మాఝి (Mohan Charan Majhi) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం పదవి దక్కడంపై ఆయన కుటుంబం అమితానందం వ్యక్తం చేస్తోంది. 

Updated : 12 Jun 2024 14:27 IST

భువనేశ్వర్‌: రెండు దశాబ్దాల తర్వాత ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి (Mohan Charan Majhi).. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసన సభ్యులంతా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని భాజపా అగ్రనాయకత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మీడియాలో ఈ వార్త చూసిన ఆయన కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఇలాంటి ఓ సందర్భం ఒకటి వస్తుందని అనుకోలేదంటూ ఆనందం వ్యక్తం చేసింది.

మోహన్‌ సతీమణి ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘నా భర్త సీఎం అవుతారని నేనెప్పుడు అనుకోలేదు. ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని భావించా. ఇది మాకు చాలా గొప్పవిషయం’’ అని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరొస్తారా..? అని టీవీ చూస్తున్న తమకు ఈ విషయం తెలిసిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దిశగా ఆయన పాలన సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడే తోటివారికి సహాయం చేయడంలో ముందుండేవాడు. సర్పంచ్‌, ఎమ్మెల్యేగా పనిచేసిన నా కుమారుడు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు’’ అని ఆయన తల్లి బాలే మాఝి పుత్రోత్సాహం పొందారు. మోహన్‌కు ఇద్దరు కుమారులు. తమ స్నేహితులు ట్రీట్‌ అడుగుతున్నారంటూ వారు వెల్లడించారు. ఆయన స్వస్థలం రైకలాలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.

ఒడిశా సీఎంగా మోహన్‌చరణ మాఝి

గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్‌ గమాంగ్‌ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ఇప్పుడు మాఝి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. 1997 నుంచి 2000 వరకు మాఝి సర్పంచిగా పనిచేశారు. దాంతోపాటు భాజపా గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాఝి... కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ శాసనసభలో భాజపా సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని