Covid Test: సెకనులో కొవిడ్‌ ఫలితం!

కేవలం ఒక్క క్షణంలో కరోనా ఫలితాన్ని రాబట్టే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోసెన్సార్స్‌ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షను చేసే విధానాన్ని కనుగొన్నట్లు అమెరికాకు చెందిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.

Updated : 30 Aug 2022 11:19 IST

బయోసెన్సార్‌ స్ట్రిప్‌ విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: కేవలం ఒక్క క్షణంలో కరోనా ఫలితాన్ని రాబట్టే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోసెన్సార్స్‌ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షను చేసే విధానాన్ని కనుగొన్నట్లు అమెరికాకు చెందిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. తాము తయారుచేసిన బయోసెన్సార్స్‌ స్ట్రిప్‌ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న షుగర్‌ టెస్ట్‌ స్ట్రిప్‌ను పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనా లక్షణాలున్న వ్యక్తి లాలాజలాన్ని స్ట్రిప్‌లోకి తీసుకున్నప్పుడు.. వ్యాధి నిర్ధారణ అయితే యాంటీజన్‌లు బంగారుపూత కలిగిన కాథోడ్‌కు అంటుకుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్‌ నిర్ధారణ సూచికంగా ఎలక్ట్రిక్‌ సర్క్యూట్‌లో సిగ్నల్‌ వస్తుందని తెలిపారు. ఈ సిగ్నల్‌ ఓ సంఖ్యగా మారి తెరపై కనిపిస్తుందని వెల్లడించారు. సంఖ్యలో మార్పు రోగి శరీరంలోని యాంటీజన్‌ గాఢతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధానంలో ఉపయోగించే సెన్సార్‌ స్ట్రిప్‌ ఓసారి వాడిన తర్వాత పడేయాల్సి ఉంటుంది. కానీ, టెస్ట్‌ సర్క్యూట్‌ని మాత్రం తిరిగి వాడుకోవచ్చు. ఈ బయోసెన్సార్‌ విధానం కొవిడ్‌ పరీక్షల సమయం, ఖర్చు గణనీయంగా తగ్గిస్తుందని.. కేవలం కొవిడ్‌ గుర్తింపునకే కాకుండా ఇతర వ్యాధులను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

మరోవైపు ఇంటివద్దే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకునే నూతన యాంటీజెన్‌ కిట్‌ భారత్‌లో సైతం అందుబాటులోకి వచ్చింది. మైల్యాబ్‌ అభివృద్ధి చేసిన కొవిసెల్ఫ్‌ (CoviSelf) ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌ ద్వారా కేవలం పదిహేను నిమిషాల్లోపే కొవిడ్‌ నిర్ధారణ చేసుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఈ కిట్‌ ధర రూ.250 మాత్రమే అని పేర్కొంది. ఈ పద్ధతిలో నమూనాలను స్వాబ్‌ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని