molnupiravir: కరోనా ఆర్‌ఎన్‌ఏపై గురిపెట్టే.. మోల్నుపిరవిర్‌..!

కొవిడ్‌ రోగుల చికిత్సలో మాత్రల వినియోగం తక్కువగా ఉంటోంది.. ఎక్కువగా మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌, రెమిడెసివీర్‌ వంటి వాటిని సూదిసాయంతో శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు.

Updated : 29 Dec 2021 17:18 IST

 కొవిడ్‌-19 బాధితులకు పెద్ద ఊరట

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కొవిడ్‌ రోగుల చికిత్సలో మాత్రల వినియోగం తక్కువగా ఉంటోంది. ఎక్కువగా మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌, రెమిడెసివిర్‌ వంటి వాటిని సూదిసాయంతో శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు. ఫావిపిరవిర్‌ మాత్రమే ట్యాబ్లెట్‌ రూపంలో ఇప్పటి వరకూ అందుబాటులో ఉంది. తాజాగా మోల్నుపిరవిర్‌ (MK-4482, EIDD-2801)కు అమెరికా, యూకే సహా భారత్‌ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో భారత్‌లోనే దాదాపు 13 కంపెనీలు వివిధ బ్రాండ్ల పేర్లతో దీనిని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వైరస్‌పై ఈ ఔషధం ఏమీ రామబాణం కాకపోయినా .. ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను లక్ష్యంగా చేసుకొని ఇది పనిచేస్తుంది. ఫలితంగా రోగిలో వైరల్‌ లోడ్‌ గణనీయంగా తగ్గుతోంది. దీంతో రోగి వేగంగా కోలుకొనే అవకాశం లభిస్తోంది.

జన్యుక్రమాన్ని దెబ్బతీస్తుందిలా..!

కొవిడ్‌ చికిత్సలో వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధాలు వైరస్‌ పునరుత్పత్తిని మందగింపజేసి రోగిని కోలుకొనేలా చేస్తాయి. సూది సాయంతో రోగి రక్తంలోకి ప్రవేశపెట్టే రెమిడెసివిర్‌ ఈ తరహా పనితీరుకు మంచి ఉదాహరణ. కానీ, మోల్నుపిరవిర్‌ పనితీరు దీనికి భిన్నంగా ఉంటుంది. దీనిని నోటితో తీసుకోవడంతో రోగి జీవక్రియ ద్వారా రక్తంలో కలుస్తుంది. అంటే మనం ఆహారం తీసుకొంటే.. జీర్ణమై ఆ శక్తి శరీరానికి అందినట్లన్నమాట. ఇలానే మోల్నుపిరవిర్‌ కూడా శరీరంలోకి వెళ్లాకా.. మెటబాలిజం కారణంగా సచేతనమై రక్తం ద్వారా శరీర కణాల్లోకి చేరుతుంది.

ఈ క్రమంలో ‘ఆర్‌ఎన్‌ఏ’(వైరస్‌ జన్యువులు) జన్యు పదార్థం వంటి నిర్మాణాలను తయారు చేస్తుంది. తొలిదశలో వైరస్‌ పునరుత్పత్తి చేసే ఆర్‌ఎన్‌ఏ పాలిమరైజ్‌ వ్యవస్థలోకి చొరబడుతుంది. ఇక్కడ వైరస్‌ ఆర్‌ఎన్‌ఏకు అవసరమైన న్యూక్లియోసైడ్లతో మోల్నుపిరవిర్‌ తయారు చేసిన న్యూక్లియోసైడ్ల వంటి నిర్మాణాలు కలిసిపోతాయి. ఫలితంగా వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ పలు మార్పులకు (మ్యూటేషన్ల) గురవుతుంది. ఆ తర్వాత పుట్టుకొచ్చే కొత్త వైరస్‌లో విపరీతమైన జన్యు లోపాలు ఉంటాయి. ఫలితంగా ఇది పునరుత్పత్తి చేయలేదని ‘యేల్‌ మెడిసిన్‌’ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ ఔషధాన్ని ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్ల చికిత్సలో కూడా ఇదే విధంగా వాడొచ్చేమో అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 

సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయా..?

ఇప్పటి వరకూ ప్రయోగ పరీక్షల్లో మోల్నుపిరవిర్‌ వినియోగించిన వారిలో ఎటువంటి తీవ్రమైన రియాక్షన్లు కనపించలేదు. కాకపోతే ఇది వైరస్‌ ఆర్‌ఎన్‌ఏపై పనిచేస్తోంది కాబట్టి.. మనుషుల డీఎన్‌ఏ పై ఏమైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనే అనే ఆందోళనలు ఉన్నాయి. కానీ, మెర్క్‌ సంస్థ పరిశోధన ఫలితాల్లో మానవ డీఎన్‌ఏపై ఎటువంటి ప్రభావం చూపించడంలేదని తేలింది. భవిష్యత్తులో కూడా ఈ దిశగా పరిశోధనలు కొనసాగుతాయి. వైరస్‌ జన్యువులపై  పనిచేసే ఔషధాలను హెర్పస్‌ వైరస్‌, హెచ్‌ఐవీ చికిత్సలో వాడుతుండటం ఊరటనిస్తోంది. కాకపోతే.. మోల్నుపిరవిర్‌ను గర్భిణులపై ప్రయోగించి.. పరిశోధించలేదని యేల్‌ మెడిసిన్‌లో అంటువ్యాధుల నిపుణులు జైమీ మెయర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి పుట్టే పిల్లలపై దుష్ప్రభావాలు ఉంటాయా.. అనే అంశంపై పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఆసుపత్రిపాలు కాకుండా చేయడమే లక్ష్యంగా..

కొవిడ్‌ సోకిన రోగులు ఆసుపత్రి పాలు కాకుండా ఉండాలనే లక్ష్యంతోనే మోల్నుపిరవిర్‌ను అభివృద్ధి చేసినట్లు డాక్టర్‌ మేయర్‌ వెల్లడించారు. తీవ్రమైన కొవిడ్‌ బారిన పడే ప్రమాదం ఉన్నవారిని ఆసుపత్రిపాలు కాకుండా ఇది కాపాడుతుందని వెల్లడించారు. ఇక అమెరికాలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఔషధం డెల్టా వేరియంట్‌ (కరోనాలో అత్యంత ప్రమాదకరమైనది) వంటి మ్యూటేషన్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఇక మరణాల నుంచి రక్షించడంలో తొలుత జరిగిన ప్రయోగాల్లో 50శాతం ఫలితాలు చూపినా.. ఆ తర్వాత 30శాతానికి తగ్గింది.

పెద్ద ఊరట.. ఎందుకంటే..?

అమెరికా ఎఫ్‌డీఏ సంస్థ నుంచి లభించే అనుమతులే ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలకు కీలకం. ప్రస్తుతం ఆ సంస్థ కొవిడ్‌ చికిత్సకు అనుమతించిన ఏకైక ఔషధం రెమిడెసివిర్‌ మాత్రమే. ఇది కూడా సూది ద్వారా నరాల్లోకి ఇస్తారు.ఇటీవల మోల్నుపిరవిర్‌కు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు ఇచ్చింది. ఇది మాత్రల రూపంలో రావడం కలిసొచ్చే అంశం. ఫైజర్‌ కూడా మరో మాత్రను అభివృద్ధి చేస్తోంది. దీనికి అనుమతులు లభించాల్సి ఉంది.

మోల్నుపిరవిర్‌ వచ్చిందిగా.. టీకా అవసరమా..?

మోల్నుపిరవిర్‌ అందుబాటులోకి వచ్చినా.. కరోనాపై పోరులో శక్తిమంతమైన ఆయుధం టీకానే అని ‘యేల్‌ మెడిసిన్‌.ఓఆర్‌జీ’ పేర్కొంది. వాస్తవిక పరిస్థితుల్లో కొవిడ్‌ సోకిన తర్వాత సరైన సమయంలో సరైన ఔషధం వాడతారనే హామీ ఏమీ లేదు.. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకోవడమే ఉత్తమం అని పేర్కొంది.

ఎప్పుడు వాడాలి..?

ది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంటోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ వెల్లడించిన కొవిడ్‌ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు మోల్నుపిరవిర్‌ వాడకం మొదలుపెట్టాలి. ఈ లక్షణాల్లో దగ్గు, తలనొప్పి, జ్వరం, రుచి-వాసన పోవడం, ఒళ్లు నొప్పులు వంటివి ఉన్నాయి. ‘లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి.. లేకపోతే ఈ ఔషధం వాడే కీలక సమయం చేజారిపోతుంది’ అని డ్యూక్‌ యూనివర్శిటీ ఆసుపత్రిలోని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ కామరూన్‌ వోల్ఫ్‌ హెచ్చరిస్తున్నారు.  ప్రతి 12 గంటలకు నాలుగు 200 ఎంజీ మాత్ర చొప్పున ఐదు రోజులపాటు ఈ మాత్రలు వాడాలి. అంటే మొత్తం 40 మాత్రలు అవసరం అవుతాయి. భారత్‌లో ఈ ఔషధానికి కొరత రాకపోవచ్చు. మొత్తం 13 ఔషధ కంపెనీలు దీనిని తయారు చేస్తున్నాయి. వీటిల్లో డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, నాట్కో, ఆప్టిమస్‌, స్ట్రైడ్‌, హెటిరో వంటి సంస్థలు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు