Published : 13 Aug 2022 19:23 IST

DGCA: విమానాలకు పక్షుల ముప్పు! డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ

దిల్లీ: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో(Airports) పక్షులు, ఇతర వన్యప్రాణులు విమానాలను ఢీకొంటున్న ఘటన(Bird Hits)లు వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. వాటిని నివారించేందుకుగానూ డీజీసీఏ(DGCA) శనివారం ఎయిర్‌పోర్ట్‌ల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.  పెట్రోలింగ్‌(Random patrols), అసాధారణ రీతిలో వన్యప్రాణుల కదలికలు ఉంటే.. పైలట్‌లకు సమాచారం అందించడం వంటివి ఇందులో ఉన్నాయి.

ఇటీవలి వారాల్లో విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు విరివిగా నమోదైన విషయం తెలిసిందే. ఆగస్టు 4న అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్లే గో ఫస్ట్‌, అంతకుముందు జూన్ 19న పట్నా నుంచి దిల్లీకి టేకాఫ్ అయిన స్పైస్‌జెట్.. ఇలా పలు విమానాలు పక్షులు ఢీకొన్న ఘటనలతో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లందరూ తమ ‘వన్యప్రాణుల విపత్తు నిర్వహణ కార్యక్రమాల’ను సమీక్షించాల్సిందిగా డీజీసీఏ తన తాజా సర్క్యులర్‌లో సూచించింది. వాటిలోని లోపాలను సరిచేసి.. విమానాశ్రయం, పరిసరాల్లో పకడ్బందీగా అమలు చేయాలని చెప్పింది. దీంతోపాటు విమానాలకు వన్యప్రాణులతో పొంచి ఉన్న ముప్పుపై అంచనాలు రూపొందించాలని.. వాటి కదలికలను పర్యవేక్షించేందుకు, రికార్డ్ చేసేందుకు తప్పనిసరిగా ఒక విధానాన్ని కలిగి ఉండాలని పేర్కొంది.

విమానాశ్రయం, పరిసరాల్లో భారీఎత్తున వన్యప్రాణుల కదలికలు ఉన్న సమయంలో.. పైలట్‌లను అప్రమత్తం చేసేందుకు వీలుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని డీజీసీఏ సూచించింది. రోజు ఒకే సమయానికి కాకుండా.. వేర్వేరు సమయాల్లో సాధారణ పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించింది. ప్రతి నెల 7వ తేదీలోపు వన్యప్రాణుల విపత్తు నిర్వహణ కార్యక్రమం అమలుపై నెలవారీ నివేదికలు, వన్యప్రాణుల డేటాను అందజేయాలని విమానాశ్రయ నిర్వాహకులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని