New Parliament: మే చివరి వారంలో పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభం..?

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో (Central Vista) భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్‌ భవనాన్ని (New Parliament) మే చివరి వారంలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 16 May 2023 19:43 IST

దిల్లీ: దేశ రాజధానిలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో (Central Vista) భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్‌ భవనం (New Parliament) ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటోందని.. మే చివరినాటికి సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, అధికారికంగా తేదీని మాత్రం నిర్ణయించలేదని తెలిపాయి. దీంతో ఈ నెల చివరి వారంలో పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న దృష్ట్యా.. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మే 26, 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టగా.. మే 30, 2019న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

నూతన పార్లమెంటు భవనానికి డిసెంబర్‌ 2020లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్‌ భవనం ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. కొత్త పార్లమెంట్‌ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా దీన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. దీని నిర్మాణ వ్యయం రూ.970కోట్లు అని అంచనా.

మరోవైపు నూతన పార్లమెంట్‌ భవనాన్ని మే నెలఖరులో ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు ఇటీవల వెల్లడించాయి. అలంకరణతోపాటు ఇతర పనుల కోసం టెండర్లు సైతం పిలిచినట్లు వివరించాయి. ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేశాయి. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్యపథ్‌ మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల స్థలంలో పార్లమెంట్‌ భవనం సహా కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. సెంట్రల్‌ సెక్రటేరియట్‌, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లను సిద్ధం చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను పార్లమెంటు సెక్రటేరియట్‌ కూడా ఇటీవలే విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని