ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం!

సరిగ్గా కరోనా మహమ్మారి అంతానికి ముహూర్తం కుదిరిన వేళ.. కొత్తగా మరో రకం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే 30 దేశాలకు పాకిపోయింది. తొలి వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని మరోసారి కలవరానికి గురిచేస్తుంది........

Updated : 03 Jan 2021 09:06 IST

30 దేశాలకు పాకిన నూతన వేరియంట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి అంతానికి ముహూర్తం కుదిరిన వేళ.. కొత్తగా మరో రకం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే 30 దేశాలకు పాకిపోయింది. తొలి వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని మరోసారి కలవరానికి గురిచేస్తోంది. రోజుకో దేశంలో ఈ రకం వెలుగులోకి వస్తూనే ఉంది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొత్త వైరస్‌ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. తొలి వైరస్‌ వ్యాప్తి నివారణలో వేసిన తప్పటడుగులను గుర్తుంచుకొని వ్యవహరిస్తున్నాయి. విమాన రాకపోకలపై ఆంక్షలు, అవసమైన చోట లాక్‌డౌన్‌లు విధించడంలో వేగంగా స్పందించాయి.

ఇప్పటి వరకు ఈ మహమ్మారి 30 దేశాల్లో వెలుగు చూసింది. తాజాగా వియత్నాంతో శనివారం తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన ఓ మహిళలో ఈ కొత్త రకం వైరస్‌ను గుర్తించారు. వెంటనే ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నిషేధించింది. యూకే నుంచి వచ్చే తమవారి కోసం మాత్రమే ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది. అంతకుముందు శుక్రవారం టర్కీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. వీరంతా యూకే నుంచి తిరిగొచ్చిన వారిగా గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా అంతర్జాతీయ విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇదే తరహాలో చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌లో ఇప్పటి వరకు 29 కేసులు నిర్ధారణ కాగా.. విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్‌ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందని అక్కడి వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికాలో ఈ కొత్త రకం మరింత కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా రోగులతో ఇప్పటికే నిండిపోయిన అక్కడి ఆస్పత్రులకు ఇది పెనుసవాల్‌గా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఇక కొత్తరకానికి కేంద్రంగా ఉన్న బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు యంత్రాంగాలు సిద్ధమయ్యాయి. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్‌ పార్క్‌లు పూర్తిగా మూసివేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కాస్త తక్కువ వ్యాప్తి ఉన్న ఐర్లాండ్‌లోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి వైరస్ ముప్పు పొంచి ఉందని అక్కడి హెల్త్‌ సర్వీసెస్‌ సీఈవో పాల్‌ రేడ్‌ తెలిపారు.

మరోవైపు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు పదిలక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందజేశారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 4,225,756 మందికి టీకా అందించినట్లు సీడీసీ వెల్లడించింది. కొత్త వైరస్‌నూ ఈ వ్యాక్సిన్లు కట్టడి చేస్తాయని భావిస్తున్నప్పటికీ.. అందరికీ టీకా అందేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త రకం ప్రపంచాన్ని చుట్టేసి మరో విడత విజృంభణకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇవీ చదవండి..

విజయవంతంగా కరోనా కొత్త వైరస్‌ వృద్ధి

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని