Corona: విలయానికి కొత్త రకాలే కారణం కాదు

బారత్‌లో విస్తరిస్తున్న కరోనా రకానికి వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని.. వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను సైతం తప్పించుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన.......

Updated : 09 May 2021 16:38 IST

డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త స్వామినాథన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో విస్తరిస్తున్న కరోనా రకానికి వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని.. వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను సైతం ఇది తప్పించుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. గత అక్టోబర్‌లో గుర్తించిన బి.1.617 రకమే భారత్‌లో ప్రస్తుత కరోనా విలయానికి కారణమని తెలిపారు.

అలాగే, భారత్‌లో కరోనా ఉద్ధృతికి వైరస్‌ కొత్త రకాలు ఒక్కటే కారణం కాదని స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడేందుకు, భారీ స్థాయి సమావేశాలకు అనుమతి ఇవ్వడం వల్ల వైరస్‌ పోరులో భారత్‌ ఒకరకంగా నిర్లక్ష్యం వహించినట్లయిందని వివరించారు. వైరస్‌ వ్యాప్తి ఇక ముగిసిందని పొరబడిన ప్రజలు మాస్కులు ధరించడం వంటి నిబంధనల్ని పాటించడంలో ఏమరపాటుగా వ్యవహరించారని తెలిపారు.

భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి నెమ్మదిగా ఉండాల్సిందని.. తొలి రోజుల్లో అదే జరిగిందని స్వామినాథన్‌ తెలిపారు. కానీ, కేసులు ఒక్కసారిగా పెరగడం ప్రారంభం అయిన తర్వాత వైరస్‌ విలయాన్ని ఆపడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఒక్కసారి లక్షలాది మంది వైరస్‌ బాధితులుగా మారితే..  వ్యాప్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుందని.. నియంత్రించడం కష్టంగా మారుతుందని వివరించారు.

వ్యాక్సిన్‌ తయారీపై భారత్‌లో భారీ ఎత్తున చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. కేవలం వ్యాక్సినేషన్‌ వల్ల పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేమని తెలిపారు. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం రెండు శాతం మందికి మాత్రమే టీకా అందిందని తెలిపారు. 70-80 శాతం మందికి టీకా అందాలంటే సంవత్సరాలు కాకపోయినా కొన్ని నెలలైనా పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కఠిన కట్టడి నిబంధనల్ని పాటించాలని సూచించారు.

వైరస్‌ వ్యాపిస్తున్న కొద్దీ కొత్త రకాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయని స్వామినాథన్‌ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో రూపాంతరం చెందిన వైరస్‌ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చునని తెలిపారు. అదే జరిగితే ప్రపంచం మరోసారి భారీ ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని