Corona: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త వేరియంట్ల ముప్పు

మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా కొత్త వేరియంట్లు సవాల్‌ విసిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా సహా కొత్త వస్తున్న కరోనా రకాలపై తామంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు....

Published : 11 Jul 2021 19:33 IST

ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌

వెనీస్‌: మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా కొత్త వేరియంట్లు సవాల్‌ విసిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా సహా కొత్తగా వస్తున్న కరోనా రకాలపై తామంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు. పరస్పర సహకారంతో యావత్‌ ప్రపంచం అనుసంధానమై ఉన్న నేపథ్యంలో ఏ మూలన మహమ్మారి విజృంభించినా అది ఇతర దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. వెనీస్‌లో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జి-20 సభ్యదేశాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని యెల్లెన్‌ తెలిపారు. అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనా టీకాలను సమకూర్చుకునేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో నిధులు అందజేశాయని తెలిపారు. అయినా.. ప్రభావవంతమైన ఫలితాల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అలాగే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను అరికట్టే ఏర్పాట్ల కోసం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని