
కొత్త సంవత్సరం వేళ..మూగబోయిన ప్రపంచం..!
కాన్‌బెర్రా: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచం నూతన ఉత్సాహంతో పండుగ చేసుకుంటుంది. ప్రపంచ దేశాలు కలిసి చేసుకునే ఒకే ఒక్క ఉత్సవం ఏదైనా ఉందంటే అది కేవలం నూతన సంవత్సరమనే చెప్పవచ్చు. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. బాణసంచా, కేరింతలు, నృత్యాలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే అలవాటు ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్నేళ్లుగా మరింత పెరిగింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం ప్రపంచ దేశాలు కొత్త ఏడాది ఉత్సవాలకు దూరంగా ఉండనున్నాయి. ఓవైపు కరోనా వైరస్‌పై ఆందోళన.. మరోవైపు ప్రభుత్వాల ఆంక్షల నడుమ నిరాడంబరంగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వివిధ దేశాల ప్రజలు సిద్ధమయ్యారు.
ఆస్ట్రేలియా.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే దేశాల్లో ఆస్ట్రేలియా ముందుండే విషయం తెలిసిందే. ప్రతి ఏటా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే కార్యక్రమాలను ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే అతిపెద్ద ఫైర్‌వర్క్స్ కార్యక్రమంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారని అంచనా. అలాంటి భారీ వేడుకలను వీక్షించడానికి యావత్ ప్రపంచం నుంచి పర్యటకులు ఆసక్తి చూపిస్తారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈసారి మాత్రం కరోనా ప్రభావంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లక్షల మంది పాల్గొనాల్సిన సిడ్నీ హార్బర్ మూగబోనుంది. ఈసారి భారీ బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేయడం లేదని సిడ్నీ అధికారులు ప్రకటించారు. తక్కువ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదని.. కేవలం టీవీల్లో మాత్రమే చూడాలని సూచించారు. కేవలం హార్బర్‌కు చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ల నుంచి మాత్రమే నేరుగా చూసే అవకాశం ఉంది. గతకొన్నిరోజులుగా సిడ్నీ నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంలోనే ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
మెల్‌బోర్న్.. ఇక ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న మెల్‌బోర్న్‌లోనూ నూతన సంవత్సర ఫైర్‌వర్క్స్ కార్యక్రమాలను రద్దు చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఫైర్‌వర్క్స్ రద్దు చేశామని.. తప్పని పరిస్థితుల్లోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మెల్‌బోర్న్ మేయర్ సాలీ క్యాప్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రతిఏటా ఏర్పాటు చేసే ఫైర్‌వర్క్స్ కార్యక్రమంలో దాదాపు నాలుగున్నర నుంచి 5లక్షల మంది పాల్గొంటారని అంచనా.
న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాకు సమీప దేశమైన న్యూజిలాండ్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేశారు. అయితే, ఇక్కడ కరోనా వైరస్ తీవ్రత కాస్త అదుపులోనే ఉందనే చెప్పవచ్చు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారీస్థాయిలో వేడుకల నిర్వహణకు దూరంగా ఉంది.
దక్షిణ కొరియా.. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నందున దక్షిణ కొరియాలోనూ కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రభుత్వం రద్దుచేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసే ‘బెల్ రింగింగ్’ కార్యక్రమాన్ని కూడా 1953 తర్వాత తొలిసారి రద్దుచేశారు. డిసెంబర్ రాత్రి 12గంటలు కాగానే అక్కడ ఉన్న గంటను మోగించడం కొరియన్ యుద్ధం ముగిసిన నాటినుంచి సంప్రదాయంగా వస్తోంది. ప్రతిఏటా ఈ కార్యక్రమంలో దాదాపు లక్షమంది పాల్గొనడంతో పాటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ సారి మాత్రం కరోనా కారణంగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. వీటితో పాటు మరిన్ని నూతన సంవత్సర వేడుకలపై కూడా దక్షిణకొరియా ఆంక్షలు విధించింది.
జపాన్.. కొత్త సంవత్సరం వేళ జపాన్‌లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ డిసెంబర్ 31 రాత్రి ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా లక్షల మంది సందర్శించే టోక్యోలోని మైజీ సందర్శన ప్రదేశాన్ని కూడా ఈ సాయంత్రానికే మూసివేయనున్నారు. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో ఈ అర్థరాత్రి మెట్రో సేవలను కూడా రద్దుచేశారు.
చైనాలోనూ.. కరోనా వైరస్‌కు కారణమైన చైనాలోనూ ఈ సారి కొత్త సంవత్సరం వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, జనవరి 1 కంటే ఎక్కువగా ఫిబ్రవరిలో చైనా జరుపుకునే కొత్త సంవత్సర వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తారు. వీటిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా గతకొన్ని దశాబ్దాలుగా అక్కడ హాలిడే కల్చర్ కూడా కొనసాగుతోంది. అయితే, ఈసారి మాత్రం చాలావరకు కొత్త సంవత్సర వేడుకలు మునుపటిలా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
బీజింగ్.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ‘కౌంట్‌డౌన్’ కార్యక్రమంలో ఈసారి కేవలం కొద్దిమందికే అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నగరంలో జరిగే ఇతర నూతన సంవత్సర వేడుకలను దాదాపు రద్దు చేశారు. వీటికితోడు రాత్రిపూట ఉష్ణోగ్రతలు మైనస్ 15డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడం కూడా ప్రజలు ఈ వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే, ఫిబ్రవరిలో జరిగే చైనా కొత్త సంవత్సర వేడుకల నాటికే చైనాలో దాదాపు 5కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హాంగ్‌కాంగ్.. కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకొనే ప్రాంతాల్లో హాంగ్‌కాంగ్ కూడా ఒకటనే చెప్పవచ్చు. ప్రతిఏటా భారీస్థాయిలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే, గతకొంత కాలంగా అక్కడ జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో గత ఏడాది అక్కడ కొత్త సంవత్సర వేడుకలను రద్దుచేశారు. ఈసారి మాత్రం కరోనా వైరస్ కారణంగా నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటుచేసే ఫైర్‌వర్క్స్ కార్యక్రమాలను రద్దుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అక్కడ భౌతిక దూరం ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేవలం ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రజలు గుమికూడకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
తైవాన్..మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు తైవాన్ సిద్ధమైంది. ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారిని జయించిన అతికొద్ది దేశాల్లో తైవాన్ ముందుందనే చెప్పవచ్చు. కేవలం ఇక్కడ ఇప్పటివరకు 700పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సారి ఫైర్‌వర్స్క్‌ను యథావిథిగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఐకానిక్ టవర్‌గా పిలిచే తైపీ-101 వద్ద ఫైర్‌వర్క్స్‌ను నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే, మరిన్ని ఆసియా, యూరప్, అమెరికా దేశాల్లోనూ నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా పరిమిత స్థాయిలోనే వేడుకలను నిర్వహించుకునేందుకు ఆయా దేశాలు అనుమతులు ఇస్తున్నాయి. ఏదేమైనా, యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి, ఎన్నోసవాళ్లను చూపిన 2020కి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోనైనా వీటినుంచి బయటపడుతామని ఆశతో యావత్ ప్రపంచం స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తోంది.
ఇవీ చదవండి..
దిల్లీలో కొత్త సంవత్సర వేడుకలకు చెక్
జనవరి నుంచి వచ్చే మార్పులివీ..