Delta variant: ఆరు నెలల తర్వాత అక్కడ తొలి కొవిడ్‌ మరణం

కొవిడ్‌ వైరస్‌ను అదుపు చేసి ఎంతో అప్రమత్తంగా ఉంటున్న న్యూజిలాండ్‌ను డెల్టా వేరియంట్‌ వణికిస్తోంది. ఆరు నెలల తర్వాత అక్కడ తొలి కొవిడ్‌ మరణం సంభవించింది....

Published : 04 Sep 2021 16:19 IST

వెల్లింగ్టన్‌: కొవిడ్‌ వైరస్‌ను అదుపు చేసి ఎంతో అప్రమత్తంగా ఉంటున్న న్యూజిలాండ్‌ను డెల్టా వేరియంట్‌ వణికిస్తోంది. ఆరు నెలల తర్వాత అక్కడ తొలి కొవిడ్‌ మరణం సంభవించింది. కరోనా లక్షణాలతో శనివారం 90 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఆక్లాండ్‌కు చెందిన మహిళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. ఫిబ్రవరి 16 తర్వాత న్యూజిలాండ్‌లో తొలి కరోనా మరణం ఇదే. దీంతో న్యూజిలాండ్‌వ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 27కు చేరింది.

1.7 మిలియన్ల జనాభాతో న్యూజిలాండ్‌లోనే అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌కు చెందిన సదరు వృద్ధురాలు ఇంట్లోని ఓ వ్యక్తికి ఈ మధ్యే కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అతడి నుంచే వైరస్‌ ఆమెకు సోకి ఉంటుందని ఆరోగ్య సిబ్బంది అనుమానిస్తున్నారు. మహిళ మృతిపట్ల ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ జాగ్రత్తలు వహించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అనేక రోజులపాటు ఒక్క కేసు కూడా నమోదు కాని న్యూజిలాండ్‌లో గత నెల 17న ఆక్లాండ్‌లో తొలి కేసు నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు లాక్‌డౌన్‌ విధించారు. అయినప్పటికీ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 20 మంది వైరస్‌ బారిన పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని