Indian Railway: వాళ్లంతా పదేళ్లు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిందే: రైల్వే బోర్డు

యూపీఎస్సీ (USPS) ద్వారా రైల్వే గ్రూప్‌ A స్థాయిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారంతా తొలి 10 ఏళ్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది.

Published : 01 Mar 2023 01:48 IST

దిల్లీ: రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వేలో కొత్తగా నియమితులైన గ్రూప్‌ A (Group A Employees) ఉద్యోగులంతా కనీసం 10 ఏళ్లపాటు క్షేత్రస్థాయిలో పని చేయాలని, ఆ తర్వాతే ప్రధాన కార్యాలయం (Head Quarters)లో పని చేసేందుకు అర్హులవుతారని పేర్కొంది. ఈ మేరకు రైల్వే నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా రైల్వే ప్రధాన కార్యాలయంలో పని చేసేందుకు వీలుంది. కానీ, క్షేత్రస్థాయిలో పని చేసిన అనుభవాన్ని పొందేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

‘‘ నేరుగా ఉద్యోగంలో చేరిన గ్రూప్‌ -A స్థాయి ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తగినంత అనుభవం సాధించేందుకు మొదటి 10 సంవత్సరాల సర్వీను క్షేత్ర స్థాయిలోనే పూర్తి చేయాలి. ఆ తర్వాతే ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం పొందేందుకు అర్హత సాధిస్తారు’’ అని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఓ అవగాహన ఉంటే..  తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయని సీనియర్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. ‘‘క్షేత్ర స్థాయిలో పని చేయడం వల్ల ప్రాథమిక స్థాయిలో ఏం జరుగుతుందనేది వాళ్లకు తెలుస్తుంది.’’ అని ఆయన అన్నారు.

ఇటీవల నల్గొండ జిల్లా బీబీనగర్‌ సమీపంలో రైలు పట్టాలు తప్పిన తర్వాత జరిగిన సమావేశంలో రైల్వే బోర్డు ఛైర్మన్‌  ఏకే లహోటి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న జనరల్‌మేనేజర్లు, డివిజినల్‌ మేనేజర్లు స్వయంగా ప్రమాద స్థలానికి వెళ్లి పరిష్కారాలను కనుగొనాలని చెప్పిన సంగతి తెలిసిందే.‘‘ క్షేత్రస్థాయిలో పని చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. సంస్థకు కూడా క్షేత్రస్థాయిలో పని చేసే వారి అవసరం ఉంది.యువ అధికారులు అక్కడ పని చేస్తే సవాళ్లను ఎదుర్కోవడం మరింత సులువవుతుంది. అందుకే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’’ అని మరో సీనియర్‌ అధికారి తెలిపారు.

మరోవైపు అత్యవసర సందర్భాల్లో జనరల్‌మేనేజర్‌ స్థాయి అధికారి ఆమోదంతోనే ఒక ఉద్యోగి ప్రధాన కార్యాలయంలో పని చేసేందుకు వీలుందని ఫిబ్రవరి 21న జారీ చేసిన ఉత్తర్వులోనూ రైల్వేబోర్డు పేర్కొంది. రైళ్ల రాకపోకల నుంచి, విధానాల రూపకల్పన వరకు, సాంకేతిక అంశాల నుంచి ఆదాయం వరకు మొత్తం యాంత్రాంగాన్ని గ్రూప్‌- A ఉద్యోగులే పర్యవేక్షిస్తారు. వీరందర్నీ యూపీఎస్సీ ద్వారా నియమిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని