Newsclick: న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు

Newsclick: న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 03 Oct 2023 22:27 IST

దిల్లీ: న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ న్యూస్‌ పోర్టల్‌కు విదేశీ నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఉదయం 30చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. ఇప్పటివరకు ప్రబిర్‌ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు దిల్లీ పోలీస్‌ అధికార ప్రతినిధి సుమన్‌ నల్వా వెల్లడించారు. అయితే, అమిత్‌ చక్రవర్తికి ఈ కేసుతో సంబంధం ఏమిటనే వివరాలు మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు. 

‘న్యూస్‌క్లిక్‌’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్‌ నెవిల్‌ రాయ్‌సింగం నుంచి గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. మంగళవారం ఉదయం న్యూస్‌క్లిక్‌ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలను మోహరించారు.

పోలీసుల తీరుపై విమర్శలు..

మరోవైపు, ‘న్యూస్‌క్లిక్‌’తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై దిల్లీ పోలీసులు దాడులు చేయడంపై ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని.. వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామంటూ ట్వీట్‌ చేసింది. ‘న్యూస్‌క్లిక్‌’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని