Oxygen: న్యూజిలాండ్‌ హైకమిషన్‌ విన్నపం వివాదాస్పదం!

భారత్‌లోని న్యూజిలాండ్‌ హైకమిషన్‌ చేసిన ఓ ట్వీట్ ఆదివారం వివాదాస్పదంగా మారింది. కమిషన్‌లో ఓ వ్యక్తికి ఆరోగ్యం విషమించడంతో ఆక్సిజన్‌ కోసం పలువురికి సందేశం పంపింది.

Published : 03 May 2021 01:16 IST

దిల్లీ: భారత్‌లోని న్యూజిలాండ్‌ హైకమిషన్‌ చేసిన ఓ ట్వీట్ ఆదివారం వివాదాస్పదంగా మారింది. కమిషన్‌లో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవవడంతో ఆక్సిజన్‌ కోసం పలువురికి సందేశం పంపింది. అందులో భాగంగా ఇండియన్ యూత్‌ కాంగ్రెస్‌కు కూడా ఆక్సిజన్‌ కోసం ట్విటర్‌ వేదికగా సందేశం పంపింది. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే ఆ ట్వీట్‌ తొలగించింది. ప్రభుత్వ ఒత్తిడి వల్లే హైకమిషన్‌ సందేశాన్ని డిలీట్‌ చేసిందని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. హైకమిషన్‌ విజ్ఞప్తికి స్పందించిన కాంగ్రెస్‌ వర్గాలు వెంటనే సిలిండర్‌తో కార్యాలయానికి చేరుకున్నాయి. అక్కడి సిబ్బంది గేట్లు తీసి సిలిండర్లు లోపలికి అనుమతించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ శ్రేణులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశాయి. హైకమిషన్‌ సిబ్బంది ధన్యవాదాలు కూడా తెలిపినట్లు పేర్కొన్నాయి. ఈ ఉదంతం చర్చనీయాంశం కావడంతో న్యూజిలాండ్‌ హైకమిషన్‌ స్పందించింది. ఆక్సిజన్‌ కోసం అన్ని వర్గాలను ఆశ్రయించామని.. దీన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. అందుకు క్షమాపణలు కూడా చెప్పింది.

మరోవైపు ఈ ఉదంతం తర్వాత విదేశాంగ శాఖ స్పందించింది. విదేశీ రాయబార కార్యాలయాల్లో ఆక్సిజన్ సహా ఇతర అత్యవసర సరఫరాలను నిల్వ చేయొద్దని ఆదేశించింది. హై కమిషన్లు, దౌత్యకార్యాలయాలకు కావాల్సిన వైద్య సాయాన్ని వెంటనే అందిస్తున్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని