Corona Virus: కరోనా కలవరం.. వచ్చే 40 రోజులు కీలకం, కానీ..!

చైనా సహా పలు దేశాల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో పరీక్షలు చేస్తున్నారు. గత 2 రోజుల్లో 39 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. మరోవైపు జనవరిలో దేశవ్యాప్తంగా కేసులు పెరిగే అవకాశముందనే అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Published : 28 Dec 2022 17:30 IST

దిల్లీ: చైనా (China) సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా (Corona Virus) మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో దేశంలోనూ మరోసారి కొవిడ్‌ కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి పెరగకుండా ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. అయితే, వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ (Covid 19) కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే 40 రోజులు కీలకం కానున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తిని ముందస్తుగా కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టనుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది.

‘‘గతంలో తూర్పు ఆసియాలో కొవిడ్‌ కొత్త వేవ్‌ మొదలైన దాదాపు 30-35 రోజుల తర్వాత భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి మొదలవ్వడం గుర్తించాం. ఆ ట్రెండ్‌ను గమనిస్తే జనవరిలో దేశవ్యాప్తంగా కేసులు పెరగొచ్చు’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సారి వైరస్ తీవ్రతగా తక్కువగానే ఉంటుందన్న అంచనాలు ఊరట కలిగిస్తున్నాయి. ‘‘ఒకవేళ కొత్త వేవ్‌ వచ్చినా.. కొవిడ్‌ మరణాలు, ఆసుపత్రుల్లో చేరికలు చాలా తక్కువే ఉంటాయి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

2 రోజుల్లో 39 మంది విదేశీ ప్రయాణికులకు పాజిటివ్‌..

చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. మిగతా దేశాల నుంచి వచ్చే విమానాల్లో 2 శాతం మందికి రాండమ్‌గా పరీక్షలు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 6వేల మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు చేయగా.. 39 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) గురువారం దిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. విమానాశ్రయంలో కరోనా పరీక్షలు, స్క్రీనింగ్‌ సదుపాయాలను ఆయన పర్యవేక్షించనున్నారు. ఇక.. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌ నుంచి వచ్చే ప్రయాణికులు ‘ఎయిర్‌ సువిధ’ పత్రాలను నింపడం, 72 గంటల ముందు నాటి ఆర్‌టీ-పీసీఆర్‌ రిపోర్ట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చేవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు