Vande Bharat: ‘వందే భారత్‌’ టాప్‌ స్పీడ్‌ ఇక 200 kmph: అశ్వినీ వైష్ణవ్‌

తదుపరి తరం వందేభారత్‌ రైళ్లు గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Updated : 04 Oct 2022 23:32 IST

ఔరంగాబాద్‌: ఆధునికీకరించిన వందేభారత్‌ రైళ్ల కోసం లాతూర్‌లోని మరాఠ్వాడా కోచ్‌ ఫ్యాక్టరీలో 1600 కోచ్‌లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఒక్కో కోచ్‌ తయారీకి రూ.8 నుంచి రూ.9 కోట్లు ఖర్చువుతుందని తెలిపారు. తదుపరి తరం వందేభారత్‌ రైళ్లు గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని చెప్పారు. ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.

‘‘తదుపరి తరం వందేభారత్‌ రైళ్లు మరాఠ్వాడాలో తయారు కానున్నాయి. లాతూర్‌లోని తయారీ కేంద్రంలో 1600 కోచ్‌లు రూపుదిద్దుకోనున్నాయి. దీనివల్ల ఫ్యాక్టరీకి చుట్టుపక్కల 400-500 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని వైష్ణవ్‌ చెప్పారు. ప్రస్తుత వందే భారత్‌ రైళ్లు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని.. తదుపరి తరం రైళ్లు గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. ఈ వెర్షన్‌ తొలి కోచ్‌ రాబోయే 15, 16 నెలల్లో అందుబాటులోకి రానుందని చెప్పారు. సెమీ హైస్పీడ్‌రైళ్లలో లోపల శబ్దాలను 60-65 డెసిబెల్స్‌కు తగ్గించగలిగామని చెప్పారు. 2014కు ముందు ట్రాకుల నిర్మాణం రోజుకు సగటు వేగం 4 కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడది 12 కిలోమీటర్లకు చేరిందని పేర్కొన్నారు. ఇది 20 కిలోమీటర్లకు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని వైష్ణవ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని