NGT: బిహార్‌ ప్రభుత్వానికి ₹4వేల కోట్ల జరిమానా.. ఎందుకంటే..?

బిహార్‌ (Bihar) ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణను సరిగా చేపట్టనందుకు గానూ.. రెండు నెలల్లో రూ.4వేల కోట్లను చెల్లించాలని ఆదేశించింది.

Updated : 05 May 2023 17:24 IST

దిల్లీ: బిహార్‌ (Bihar) ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ NGT) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు గానూ రూ.4,000 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు జమ చేయాలని నీతీశ్ సర్కారును ఆదేశించింది.

వ్యర్థాల నిర్వహణ (waste management)లో బిహార్‌ ప్రభుత్వం అలసత్వంపై ఎన్‌జీటీ అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌ తీర్పుల ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘనే. అందువల్ల ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధిస్తున్నాం. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు రింగ్‌ ఫెన్స్‌డ్‌ అకౌంట్‌కు (అత్యవసర పరిస్థితుల్లో నిధులను సంరక్షించేందుకు ఉపయోగించే ఖాతాలు) డిపాజిట్‌ చేయాలి. ఈ ఖాతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. సీఎస్‌ ఆదేశాల మేరకు ఈ ఖాతాలోని నగదును వ్యర్థాల నిర్వహణకు మాత్రమే వినియోగించాలి’’ అని ఎన్‌జీటీ (NGT) ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం నీతీశ్ కుమార్‌ సర్కారును ఆదేశించింది. పరిహార డబ్బుతో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌ సదుపాయాలు, మురుగు నీటి నిర్వహణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయాలని ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

వ్యర్థాల నిర్వహణ (waste management)లో విఫలమైనందుకు గానూ గతంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌జీటీ ఇలా భారీ మొత్తంలో జరిమానా విధించింది. గతేడాది బెంగాల్‌ సర్కారుకు రూ.3500కోట్ల పరిహారం కట్టాలని ఆదేశించింది. ఇక, ఇటీవల పంజాబ్‌లోని లూథియానాలో చోటుచేసుకున్న విషవాయువుల ఘటనపైనా ట్రైబ్యునల్‌ సీరియస్‌ అయ్యింది. విష వాయువులు పీల్చి వలస కుటుంబాల్లో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఎన్‌జీటీ.. దర్యాప్తునకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని