Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌: గడ్కరీ

రహదారి ప్రమాదాలకు గురైన వారికి నగదు తీసుకోకుండా వైద్యం అందించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రణాళికలు రూపొందిస్తోంది.

Published : 01 Apr 2022 01:34 IST

దిల్లీ: రహదారి ప్రమాదాలకు గురైన వారికి నగదు తీసుకోకుండా వైద్యం అందించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రణాళికలు రూపొందిస్తోంది. తొలుత స్వర్ణ చతుర్భుజి మార్గాల్లో దీన్ని ప్రవేశ పెట్టి.. క్రమంగా అన్ని జాతీయ రహదారులకూ విస్తరింపజేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ ప్రశ్నకు గురువారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

స్వర్ణ చతుర్భుజిలో భాగమైన దిల్లీ-ముంబయి, ముంబయి- చెన్నై, చెన్నై-కోల్‌కతా, కోల్‌కతా- ఆగ్రా, ఆగ్రా-దిల్లీ కారిడార్‌లోని జాతీయ రహదారులపై పైలట్‌ ప్రాజెక్ట్‌గా క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఆయా రహదారులపై డ్రైవర్లు, ప్రయాణికులు, పాదచారులు ఎవరైనా ప్రమాదంలో గాయపడితే ఈ స్కీమ్‌ కింద ఉచిత వైద్యం అందించనున్నారు. ప్రమాద స్థలికి అంబులెన్స్‌ చేరినప్పటి నుంచి 48 గంటల వరకు ఈ స్కీమ్‌ వర్తిస్తుందని, రూ.30వేల వరకు ఖర్చును NHAI భరించనుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించామని గడ్కరీ తెలిపారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే అన్ని జాతీయ రహదారులకు విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 710 అంబులెన్సులు వివిధ టోల్‌ప్లాజాల వద్ద అందుబాటులో ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

రెండేళ్లలో ఈవీల ధరలు పెట్రోల్‌ వాహనాలతో సమానం

రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహన ధరలు పెట్రోల్‌ వాహన ధరలతో సమానం కానున్నాయని గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్‌ టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ ఇలా.. ఏ వాహనమైనా పెట్రోల్‌ వాహన ధరలతో సమానంగా మారనున్నాయని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న వేళ.. ఎలక్ట్రిక్‌ వాహనాలే ప్రత్యామ్నాయం అని చెప్పారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని స్పీకర్‌ను ఈ సందర్భంగా కోరారు. అప్పుడు ఎంపీలందరూ ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుక్కుని ఇక్కడే ఛార్జింగ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని