NHRC: రైతు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు.. కేంద్రం సహా 4 రాష్ట్రాలకు నోటీసులు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ జరుగుతున్న రైతు ఉద్యమంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక వ్యాఖ్యలు చేసింది.....

Published : 14 Sep 2021 20:51 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ జరుగుతున్న రైతు ఉద్యమంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనలు వేలాది పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది.  రైతుల నిరసనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ అనేకమంది ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది. రాష్ట్ర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల.. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రయాణికుల సమస్యలపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్‌హెచ్‌ఆర్సీ సూచించింది. రైతు ఆందోళన సమయంలో పౌరుల హక్కులకు భంగం కలగకుండా ఏ మేర చర్యలు తీసుకున్నారో వెంటనే నివేదిక అందజేయాలని కేంద్రం సహా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, దిల్లీ, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ‘రైతుల ఉద్యమం పారిశ్రామిక యూనిట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. 9వేలకు పైగా సూక్ష్మ, మధ్యతరహా, పెద్ద కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందనే ఆరోపణలున్నాయి. రైతు ఉద్యమం రవాణాపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని.. రద్దీ కారణంగా ప్రయాణికులు, రోగులు, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు’ అని ఎన్‌హెచ్‌ఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాస్తారోకో, రద్దీ, కారణంగా ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలిపింది. ఆందోళన కారణంగా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన అవసరం ఉందని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గతేడాది నవంబర్‌ నుంచి హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌ రైతులు దిల్లీకి చేరుకొని నిరసన తెలుపుతున్నారు. కేంద్రంతో రైతు సంఘాల నేతలు పలుమార్లు చర్చలు సాగించినా అవి ఫలించలేదు. రైతుల నిరసనలను పోలీసులు అనేకసార్లు అడ్డుకున్నారు. దీంతో పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని.. వాటిని రద్దు చేసే వరకు తమ పోరు కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని