Dawood Ibrahim: దావుద్‌ ఇబ్రహీంపై రివార్డు.. ప్రకటించిన ఎన్‌ఐఏ

అండర్‌వరల్డ్‌ డాన్‌, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్‌ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రివార్డు ప్రకటించింది. అతడిని

Updated : 01 Sep 2022 14:07 IST

 

ముంబయి: అండర్‌వరల్డ్‌ డాన్‌, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావుద్‌ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25లక్షలు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు గురువారం వెల్లడించారు.

దావుద్‌ ఇబ్రహీంతో పాటు అతడి అనుచరులు చోటా షకీల్‌పై రూ. 20లక్షలు, హజి అనీస్‌ అలియాస్‌ అనీస్‌ ఇబ్రహీం షేక్‌, జావెద్‌ పటేల్‌ అలియాస్‌ జావెద్‌ చిక్నా, ఇబ్రహీం ముస్తక్‌ అబ్దుల్‌ రజాక్‌ మేమన్‌ అలియాస్‌ టైగర్‌ మెమన్‌పై రూ.15లక్షల చొప్పున రివార్డు ప్రకటిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. వీరంతా 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు వీలుగా ఎలాంటి సమాచారం తెలిసినా దర్యాప్తు సంస్థకు చేరవేయాలని అధికారులు తెలిపారు.

దావుద్‌ నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా ‘డి కంపెనీ’పై ఎన్‌ఐఏ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఆయుధాల స్మగ్లింగ్‌, నార్కో టెర్రరిజం, అండర్‌ వరల్డ్‌ క్రిమినల్‌ సిండికేట్‌, మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల మంజూరు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతోందని ఎన్‌ఐఏ పేర్కొంది. పాక్‌ ఆధారంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు కీలక సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే దావుద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావుద్‌ పేరు కరాచీ అడ్రసుతో ఉంది. 1993లో దేశ వాణిజ్య రాజధాని ముంబయి వ్యాప్తంగా 12 చోట్ల గంటల వ్యవధిలో భీకర బాంబు పేలుళ్లు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని