Yasin Malik: యాసిన్‌ మాలిక్‌కు మరణ శిక్ష విధించండి.. దిల్లీ హైకోర్టుకు ఎన్‌ఐఏ

ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత, నిషేధిత జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. అయితే, అతడికి మరణ శిక్ష విధించాలంటూ ఎన్‌ఐఏ శుక్రవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Updated : 27 May 2023 01:20 IST

దిల్లీ: ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతోపాటు దేశంపై దాడికి కుట్ర తదితర నేరాల్లో కశ్మీరీ వేర్పాటువాద నేత, నిషేధిత జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ (Yasin Malik)కు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. దిల్లీలోని పటియాలా హౌస్‌ ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు 2022 మేలో ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో అతడికి మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ అప్పట్లో వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం జీవిత ఖైదుకే మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే యాసిన్‌ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలంటూ ఎన్‌ఐఏ (NIA) శుక్రవారం దిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది. జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌, జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది.

ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాల నిర్వహణలో యాసిన్‌ మాలిక్‌ నేతృత్వం వహించిన జేకేఎల్‌ఎఫ్‌ ముందు స్థానంలో ఉంటుంది. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలపై మాలిక్‌పై 2017లో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే అధికారులు అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద మోపిన అన్ని రకాల అభియోగాల్లోనూ మాలిక్‌ను ఎన్‌ఐఏ కోర్టు దోషిగా నిర్థారించింది. ఈ నేపథ్యంలో అతనికి మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ డిమాండ్‌ చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై అప్పట్లో ఆయా దేశాల నుంచి విమర్శలు వచ్చినా.. భారత్‌ తిప్పికొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని