NIA: ఖలిస్థాన్‌ ‘టైగర్‌ ఫోర్స్‌’పై ఎన్‌ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు

పంజాబ్‌, హరియాణాల్లోని 10 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. ఖలిస్థానీ అనుకూల వర్గమైన ఉగ్రసంస్థలకు నిధులను సమీకరిస్తున్నరాన్న ఆరోపణలపై ఈ దాడులు చేపట్టింది.

Updated : 06 Jun 2023 14:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్ర గ్రూప్‌ ఖలీస్థాన్‌ టైగర్‌ఫోర్స్‌(కేటీఎఫ్‌)కు చెందిన 10 స్థావరాలపై మంగళవారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేస్తోంది. పంజాబ్‌లోని తొమ్మిది చోట్ల, హరియాణాలో ఒక చోట ఈ దాడులు జరుగుతున్నాయి. ఉగ్ర సంస్థలకు నిధుల సేకరణ, పాక్‌ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను రప్పించడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నాయి. గతేడాది ఆగస్టు 20వ తేదీన పలువురిపై సుమోటోగా కేసులు నమోదు చేసింది. మే 19న కెనడాకు చెందిన ఉగ్రవాది అర్ష్‌ దల్లా సన్నిహితులు అమృత్‌పాల్‌ సింగ్‌, అమ్రిత్క్‌ సింగ్‌లను అరెస్టు చేసింది. వీరు మనీలా నుంచి భారత్‌లో అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకొంది. వీరిపై అప్పటికే దిల్లీ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

వీరిద్దరూ అర్ష్‌ దల్లా తరఫున ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ కార్యకలాపాలను భారత్‌లో విస్తరించేందుకు పనిచేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో మరో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది మన్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులు పాక్‌ నుంచి ఆయుధ స్మగ్లింగ్‌, ఉగ్రసంస్థల్లోకి యువతను ఆకర్షించడం వంటివి చేస్తున్నట్లు తెలిసింది.

‘‘ఈ నిందితులు కేటీఎఫ్‌ కోసం నిధులు సమకూర్చేందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిందితులు ప్రముఖ వ్యాపారవేత్తలను గుర్తించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఇళ్లు, ఇతర ఆస్తులను నిందితుల అనుచరులు దహనం చేస్తున్నారు’’ అని ఎన్‌ఐఏ పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని