Drone Attack: ఎన్ఐఏకు ‘డ్రోన్‌దాడి’ కేసు

జమ్మూ వైమానిక స్థావరంపై గత ఆదివారం జరిగిన డ్రోన్‌ దాడి ఘటనపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక

Updated : 29 Jun 2021 14:04 IST

దిల్లీ: జమ్మూ వైమానిక స్థావరంపై గత ఆదివారం జరిగిన డ్రోన్‌ దాడి ఘటన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. మరోవైపు దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రతాదళం(ఎన్‌ఎస్‌జీ)కు చెందిన ప్రత్యేక స్క్వాడ్‌ బృందం విచారణ చేపట్టింది. ఆర్డీఎక్స్‌ లేదా టీఎన్‌టీ బాంబులను ఉపయోగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల నుంచే ఈ డ్రోన్లను నియంత్రించి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, ఈ దాడిలో స్థానికుల హస్తం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు జమ్మూ వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భనవంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ  రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో భవనం పైకప్పునకు రంధ్రం పడింది. కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్మూలోని మరో సైనిక స్థావరంపై దాడిని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్‌కౌంటర్‌లో లష్కరే కీలక ఉగ్రవాది హతం

సోమవారం జమ్మూకశ్మీర్‌ పోలీసులకు చిక్కిన లష్కరే తోయిబా అగ్రశ్రేణి కమాండర్‌ నదీమ్‌ అబ్రార్‌ హతమయ్యాడు. నిన్న పారింపొరా ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అబ్రార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఏకే 47 తుపాకీ తన ఇంట్లో దాచిపెట్టినట్లు తెలిపాడు. దీంతో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అబ్రార్‌ను తీసుకుని పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. వారు లోపలికి వెళ్లగానే అప్పటికే అక్కడ దాగిఉన్న  ఓ ముష్కరుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అబ్రార్‌తోపాటు దాడి జరిపిన ముష్కరుడు కూడా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. కశ్మీర్‌లో సైన్యం, పౌరులపై జరిగిన వివిధ దాడుల్లో అబ్రార్‌ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. గత ఏడాది లవాయపొరాలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల హత్యలోనూ అబ్రార్‌ నిందితుడని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని