Twitter Ban: ‘కూ’ బాటపట్టిన నైజీరియా..!

సోషల్‌ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్‌పై ఈ మధ్యే నైజీరియా ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన భారత స్వదేశీ యాప్‌ ‘కూ’ వైపు నైజీరియా మొగ్గుచూపింది.

Published : 10 Jun 2021 22:58 IST

ప్రభుత్వ అధికారిక పేజీ ఓపెన్‌

దిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్‌పై ఈ మధ్యే నైజీరియా ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన భారత స్వదేశీ యాప్‌ ‘కూ’ వైపు నైజీరియా మొగ్గుచూపింది. తాజాగా కూ యాప్‌లో నైజీరియా ప్రభుత్వం పేజీని తెరిచింది. కూ యాప్‌లో నైజీరియా ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నట్లు ఆ సంస్థ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ ట్విటర్‌లో పోస్టు చేశారు. భారత్‌తోపాటు విదేశాల్లోనూ తమ యాప్‌ విస్తరిస్తోందని పేర్కొన్నారు.

నైజీరియాలో చెలరేగుతున్న అంతర్గత ఘర్షణలను ఉద్దేశిస్తూ అధ్యక్షుడు బుహారీ ఈమధ్య ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. 1967-1970 మధ్య కాలంలో అంత్యరుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలు తప్పవని నిరసనకారులను హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నుతున్నవారు వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. అధ్యక్షుడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో అధ్యక్షుడి ట్వీట్‌ను ట్విటర్‌ యాజమాన్యం తొలగించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నైజీరియా ప్రభుత్వం, ట్విటర్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత్‌కు చెందిన కూ యాప్‌లో నైజీరియా ప్రభుత్వం ఖాతా తెరిచింది.

సామాజిక మాధ్యమ సంస్థలో దిగ్గజ కంపెనీగా నిలిచిన ట్విటర్‌కు గత కొంతకాలంగా పలు దేశాల్లో వ్యతిరేకత మొదలవుతోంది. ముఖ్యంగా ఆయా దేశాల్లోని ఐటీ చట్టాల అమలు, ప్రైవసీకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే భారత ఐటీ చట్టాలను అమలు చేయకుంటే చర్యలు తప్పవని భారత ప్రభుత్వం కూడా హెచ్చరించింది. దీంతో ట్విటర్‌ దిగిరాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే నైజీరియా అధ్యక్షుడు  బుహారి ట్వీట్‌ను తొలగించి ఆ దేశ ఆగ్రహానికి గురయ్యింది.

దిలాఉంటే, ట్విటర్‌ను పోలినట్లుగా ఉండే ‘కూ’ యాప్‌ మార్కెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే లక్షల సంఖ్యలో ఫాలోవర్లను పొందగలిగింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్‌ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ, మరో వ్యాపారవేత్త మయాంక్‌ బిద్వత్క సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారు. 2020 మార్చిలో విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్‌ యాప్‌ ఛాలెంజ్‌లో ఉత్తమ సోషల్‌మీడియా యాప్‌గా నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ చట్టాలకు లోబడి పనిచేస్తామని మిగతా పోటీ సంస్థలకన్నా ముందే ‘కూ’ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని