Rotavac: భారత్‌ బయోటెక్‌ ‘రోటావాక్‌’ మరో ఘనత

వ్యాక్సిన్ల తయారీ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ మరో అరుదైన ఘనతను సాధించింది. తాము అభివృద్ధి చేసిన రోటావాక్(Rotavac) టీకాను.....

Published : 24 Aug 2022 19:53 IST

హైదరాబాద్‌: వ్యాక్సిన్ల తయారీ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ మరో అరుదైన ఘనతను సాధించింది. తాము అభివృద్ధి చేసిన రోటావాక్(Rotavac) టీకాను నైజీరియా ప్రభుత్వం తమ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగం చేసిందని ఆ సంస్థ వెల్లడించింది. ఇది భారత్‌ బయోటెక్‌ టీమ్‌కి గొప్ప మైలురాయిగా పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా రోటా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో 14శాతం మంది నైజీరియాకు చెందినవారే ఉండటం గమనార్హం.ఏటా ఆ దేశంలో దాదాపు 50వేల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు రోటా వైరస్‌ కారణంగా మృత్యువాతపడుతున్నారని పేర్కొన్న భారత్‌ బయోటెక్‌ సంస్థ.. రోటావాక్‌ని అక్కడి చిన్నారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్ డాక్టర్‌ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. భారత్‌లో తయారైన టీకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు కాపాడుతుండటం గర్వకారణమన్నారు. రోటావాక్ టీకాని ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మధ్య తూర్పుదేశాల్లో వినియోగిస్తున్నట్టు తెలిపారు.

దశాబ్దాల పాటు జరిగిన పరిశోధన, ఉత్పత్తి కోసం చేసిన కృషి ఫలితంగా రోటావ్యాక్స్‌ అభివృద్ధి చెందిందని.. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్లల్లో అంటువ్యాధుల్ని వ్యాప్తిని సమర్థంగా నియంత్రించగలుగుతున్నామని పేర్కొన్నారు. అంటువ్యాధులు, అనారోగ్యాల నియంత్రణకు, మరణాల్ని తగ్గించడమే లక్ష్యంగా వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి కోసం తమ సంస్థ కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని