Updated : 26 Oct 2020 12:03 IST

ట్రంప్‌నకు నిక్కీ హేలీ మూడు షరతులు!


(ఫొటో: నిక్కీ హేలీ ట్విటర్‌)

ఫిలడెల్ఫియా‌: ఇండియన్‌ అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పదవి ఇస్తానంటే ఆమె సున్నితంగా నిరాకరించారట. మరోసారి ఇదే విషయమై చర్చ జరిగినప్పుడు కొన్ని షరతుల మేరకు ఒప్పుకొన్నానని తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నిక్కీ స్వయంగా వెల్లడించారు.

అమెరికా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రధాన రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. దేశాధ్యక్ష అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నేతలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా ఫిలాడెల్ఫియాలో శనివారం నిర్వహించిన ‘ఇండియన్‌ వాయిస్‌ ఫర్‌ ట్రంప్‌’ కార్యక్రమంలో నిక్కీ హేలీ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ట్రంప్‌ ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘2016 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న నాకు డొనాల్డ్‌ ట్రంప్‌.. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ పదవిని ఇస్తానన్నారు. ఈ మేరకు నన్ను న్యూయార్క్‌కు రమ్మని విమానం కూడా పంపారు. కానీ, ఆ పదవి చేపట్టేంత అర్హురాలిని కానని, అనుభవం కూడా లేదని సున్నితంగా నిరాకరించాను. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి పదవిని చేపట్టమన్నారు. అయితే నేను మూడు షరతులు పెట్టాను. 1. రాయబారి పదవి కేబినెట్‌ ర్యాంక్‌లో ఉండాలి. 2. జాతీయ భద్రత మండలిలో సభ్యత్వం ఉండాలి. 3. అన్నింటికి తలాడించే వ్యక్తిగా ఉండను. ఈ మూడు షరతులు అంగీకరిస్తేనే పదవి స్వీకరిస్తానని చెప్పా. అందుకు ట్రంప్‌ ఒప్పుకున్నారు’’అని నిక్కీ హేలీ చెప్పుకొచ్చారు. 2017-2018 మధ్య ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ తన గళాన్ని గట్టిగా వినిపించారు.  

ఇక ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్షుడిగా ట్రంప్‌ సేవలను నిక్కీ హేలీ గుర్తు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌కు ఆర్థికసాయాన్ని ట్రంప్‌ నిలిపివేశారని తెలిపారు. ట్రంప్‌ పాలనలో అమెరికా రక్షణ రంగం సహా వివిధ అంశాల్లో భారత్‌తో భాగస్వామిగా మెలుగుతోందని చెప్పారు. కరోనా సంక్షోభం ముగిశాక భారత్‌-అమెరికా మధ్య సహాయసహకారాలు ఎక్కువ అవసరమవుతాయన్నారు. అమెరికాకు చైనాతో ముప్పు పొంచి ఉందని తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts