తుపాను ఎఫెక్ట్‌.. 130 వాహనాలు ఢీ

అమెరికాలోని టెక్సాస్‌లో వాహనాలు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన మంచు తుపాను కారణంగా రోడ్డుపై పట్టుకోల్పోయిన 130కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది

Published : 12 Feb 2021 10:09 IST

అమెరికాలో వాహనాల బీభత్సం.. 9మంది మృతి

డల్లాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో వాహనాలు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన మంచు తుపాను కారణంగా రోడ్డుపై పట్టుకోల్పోయిన 130కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. 70 మందికి పైగా గాయాలయ్యాయి. 

అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటలకు  డల్లాస్‌-ఫోర్ట్‌వర్త్‌ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన మంచు తుపాను కారణంగా వాహనాలు పట్టుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఫెడ్‌ఎక్స్‌ ట్రక్కు బారియన్‌ను ఢీకొని ఆగిపోగా.. ఆ ట్రక్కును పలు కార్లు ఢీకొట్టాయి. వేగం ఎక్కువగా ఉండటంతో కొన్ని కార్లు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. 

సమాచారమందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా.. 70 మందికిపైగా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు, ఎమర్జెన్సీ వర్కర్ల వాహనాలు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఇంకా చాలా మంది వాహనాల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది యత్నిస్తున్నారు. క్షతగాత్రులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా డల్లాస్‌లో కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించాయి. 

టెక్సాస్‌లో షెర్లీ తుపాను కారణంగా గత కొన్ని రోజులుగా మంచు విపరీతంగా కురుస్తోంది. తుపాను వల్ల పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా.. రోడ్డుపై మంచు పేరుకుపోయి తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి..

డొనాల్డ్‌ ట్రంప్‌ చుట్టూ ఉచ్చు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని