Omicron: ఒమిక్రాన్‌ సోకిన 90% మందిలో ఇవి కామన్‌!

ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్‌ మన దేశంలోనూ గణనీయంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో......

Updated : 25 Dec 2021 15:52 IST

దిల్లీ: ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్‌ మన దేశంలోనూ గణనీయంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 115 మంది కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో అధిక శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవడం, ఒకవేళ కొందరిలో కనిపించినా ఈ వేరియంట్‌ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు దిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ సోకినప్పటికీ త్వరగా కోలుకొని డిశ్చార్జి అవుతున్నారని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ సురేష్‌ పేర్కొంటున్నారు. తీవ్రమైన లక్షణాలు ఎవరిలోనూ కనబడటంలేదని తెలిపారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో దాదాపు 90శాతం కేసుల్లో మాత్రం ఎలాంటి లక్షణాలూ లేకపోవడం, వాళ్లకు చికిత్సలు కూడా అందించాల్సిన అవసరంలేకపోవడం  ఊరటనిచ్చే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు రాగా.. దిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణ 38, కేరళ 37, తమిళనాడు 34, కర్ణాటక 31, రాజస్థాన్‌ 22, హరియాణా, ఒడిశా, ఏపీలలో 4 చొప్పున కేసులు రాగా.. జమ్మూకశ్మీర్‌, బెంగాల్‌లలో మూడేసి కేసులు వచ్చాయి. ఇకపోతే యూపీలో రెండు, చండీగఢ్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నైట్‌ కర్ఫ్యూలు విధించడంతో పాటు క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికాలో తొలిసారి ఒమిక్రాన్‌ని గుర్తించి వైద్యురాలు డాక్టర్‌ అంజెలిక్‌ కూట్జీ కూడా ఇటీవల ఈ వేరియంట్‌ ప్రభావానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తమ దేశంలో ఒమిక్రాన్‌ సోకినవారంతా సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఒమిక్రాన్‌ ఇన్ఫెక్షన్‌ను గుర్తించాక ఓ మోస్తరు స్థాయిలో కొన్ని ఔషధాలను ఇవ్వడం ద్వారా కండరాల నొప్పి, తలనొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చని సూచించారు. ఆక్సిజన్‌, యాంటీబయోటిక్స్‌ వినియోగించాల్సిన అవసరం రాలేదన్నారు. 

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts