Kerala: నిఫా కేసుల తగ్గుదల.. ఆంక్షల సడలింపు

కేరళలో నిఫా కేసులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో తొమ్మిది పంచాయతీల్లో అమలవుతున్న ఆంక్షలను సడలించారు.

Updated : 19 Sep 2023 15:11 IST

తిరువనంతపురం: కేరళ (Kerala)లో నిఫా (Nipah) వైరస్‌ కేసులు అదుపులోకి రావడంతో కొయ్‌కోడ్‌ జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు. ఈ మేరకు జిల్లా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

సెప్టెంబరు 16 నుంచి రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాలేదు. హై రిస్క్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న 218 మంది నమూనాలను పరీక్షించగా.. నెగెటివ్‌ లక్షణాలు కనిపించాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో  జిల్లాలోని 53 వార్డులు, పంచాయతీల్లో ఆంక్షలను సడలించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. నిఫా పూర్తిగా నియంత్రణ కాకపోవడంతో కచ్చితంగా మాస్క్‌, సానిటైజర్లను వినియోగించాలని సూచించింది. దీంతోపాటు సామాజిక దూరం పాటించాలని ఆంక్షల్లో పేర్కొంది.

కొత్త నిబంధనలు వచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపింది. టెస్ట్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు, నిఫా సోకిన వారు కఠినమైన ఆంక్షలను పాటించాలని పేర్కొంది. ఆరోగ్య శాఖ సూచన మేరకు క్వారంటైన్‌లో ఉండాలని జిల్లా కలెక్టర్‌ తెలియజేశారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ఆంక్షలు అమలౌవుతున్న వార్డుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహణపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని