Fuel Prices: ఆయిల్‌ బాండ్లు లేకపోయి ఉంటే తగ్గించేవాళ్లం: నిర్మలా సీతారామన్‌

చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరల నుంచి ఊరట కల్పిస్తూ ఏ రోజుకైనా ప్రభుత్వం ప్రకటన చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మరోసారీ నిరాశే ఎదురైంది.

Updated : 16 Aug 2021 21:37 IST

దిల్లీ: చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరల నుంచి ఊరట కల్పిస్తూ ఏ రోజుకైనా ప్రభుత్వం ప్రకటన చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మరోసారీ నిరాశే ఎదురైంది. ఊరట ఇప్పట్లో ఉండబోదనే సంకేతమిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్‌ బాండ్ల భారమే లేకపోయి ఉంటే తప్పకుండా సామాన్యులకు ఊరట కల్పించే వాళ్లమని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఆయిల్‌ బాండ్లకు చెల్లిస్తుండడం బట్టే ఇప్పుడు పన్నులు తగ్గించలేకపోతున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సబ్సిడీకి బదులు ఆయిల్‌ కంపెనీలకు రూ.1.4లక్షల కోట్ల విలువైన ఆయిల్‌ బాండ్లను జారీ చేసింది. ఆ బాండ్లకు ఇప్పుడు మేం చెల్లించాల్సి వస్తోంది. అవే గనుక లేకుంటే తప్పకుండా చమురు ధరల భారం నుంచి విముక్తి కల్పించేవాళ్లం’’ అని పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించకపోవడానికి గల కారణాన్ని సీతారామన్‌ వివరించారు. పెట్రోల్‌ భారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదాయం కొంతమేర మెరుగుపడిందని చెప్పారు. థర్డ్‌ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. రాబోయే పండగల సీజన్‌కు ఉత్పత్తులకు గిరాకీ పెరిగి.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని