Freebies: వాటిపై నిజమైన చర్చ జరగాలి.. కేజ్రీవాల్‌కు నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌

ధనికులకు భారీ స్థాయిలో రుణ మాఫీలు చేస్తోందన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపణలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) తాజాగా స్పందించారు. ఉచితాలపై

Published : 12 Aug 2022 01:56 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం పేదవాళ్లపైనే పన్నుల భారం మోపుతూ.. ధనికులకు మాత్రం భారీ స్థాయిలో రుణ మాఫీలు చేస్తోందంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) స్పందించారు. ఉచితాలపై కేజ్రీవాల్‌ అసంబద్ధ వాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఉచిత హామీలు, పథకాలపై(Freebies) చర్చ జరగాలన్నారు. ‘విద్య, వైద్య సేవలను ఎప్పుడూ ఉచితాలుగా పేర్కొనలేదు. దేశంలో ఏ ప్రభుత్వమూ వాటిని తిరస్కరించలేదు. కాబట్టి.. విద్య, వైద్యాన్ని ఉచితాలుగా వర్గీకరిస్తూ.. పేదల్లో భయాందోళన కలిగించేందుకు కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై నిజమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అన్నారు.

‘కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగా తప్పుడు వాదనలు చేస్తున్నారు. పేదలకు ఉచిత ప్రయోజనాలు ఇవ్వడం తప్పు అని ఎవరూ అనడం లేదు. అయితే.. రుణమాఫీని ఉచితాలుగా వర్గీకరించడం, కార్పొరేట్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకే పన్ను రేట్లను తగ్గిస్తున్నారని చెప్పడం కూడా తప్పే’ అని సీతారామన్‌ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఉచిత హామీలు, పథకాలపై భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రధాని మోదీపై కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉచిత పథకాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ సీఎం ఈ మేరకు స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని