Covid Vaccine: అపోహలు..వాస్తవాలు!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై నెలకొన్న అపోహలపై స్పష్టతనివ్వడంతో పాటు వాస్తవాలను తెలియజేస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సుదీర్ఘ ప్రకటన చేశారు.

Published : 28 May 2021 11:04 IST

సుదీర్ఘ వివరణ ఇచ్చిన నీతి ఆయోగ్‌

దిల్లీ: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై గతకొద్ది రోజులుగా ప్రజలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అపోహలు వ్యక్తం చేస్తుండటం కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ల కొరత, విదేశాల నుంచి సేకరణ, ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసే విషయాలపై వక్రీకరణలు, అసత్య ప్రచారాలతో అపోహలు తలెత్తున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి అపోహలపై స్పష్టతనివ్వడంతో పాటు వాస్తవాలను తెలియజేస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

అపోహ 1: విదేశీ వ్యాక్సిన్లను కొనడంలో కేంద్రం అలసత్వం..

వాస్తవం: కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి అంతర్జాతీయ వ్యాక్సిన్‌ సంస్థలతో 2020 మధ్య నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇప్పటికే ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా సంస్థలతో పలుసార్లు చర్చలు జరిపాం. విదేశీ సంస్థల నుంచి వాటిని కొనుగోలు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయా సంస్థలకు అక్కడి స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. మనదగ్గర స్వదేశీ సంస్థలు ఎలాగైతే మనకు ప్రాధాన్యం ఇస్తాయో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలియగానే వాటిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇదేవిధంగా రష్యాతో జరిపిన చర్చలతో స్పుత్నిక్‌-వికి ఆమోదం తెలిపి, ఇప్పటికే దిగుమతి చేసుకోగలుగుతున్నాం. భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకోసం అంతర్జాతీయ సంస్థలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల అవసరాలకు అవి ఉపయోగపడతాయి.

అపోహ 2: విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వడం లేదు..

వాస్తవంభారత్‌లో విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు మార్గదర్శకాలను సవరించాం. అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, బ్రిటన్‌-ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్‌-పీఎండీఏ ఆమోదించిన వ్యాక్సిన్లతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగానికి లిస్ట్‌ చేసిన కంపెనీల వ్యాక్సిన్ల దిగుమతిని సులభతరం చేస్తూ ఏప్రిల్‌లోనే నిర్ణయం తీసుకున్నాం.

అపోహ 3: స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయడం లేదు

వాస్తవం: స్వదేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఉన్న వనరులను వాడుకుంటున్నాం. ఇందుకోసం వివిధ తయారీ సంస్థలకు సహకారాలు అందిస్తున్నాం. ఇప్పటివరకు మేధో సంపత్తి హక్కులు కలిగిన సంస్థ భారత్‌ బయోటెక్‌ ఒక్కటే ఉండగా.. మరో మూడు కంపెనీల్లో కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రస్తుతం కొవాగ్జిన్‌ టీకా నెలకు కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకుంది. అక్టోబర్‌ నాటికి నెలకు 10కోట్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇక సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 6.5కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 11కోట్ల డోసులకు పెంచేందుకు కృషి జరుగుతోంది. వీటితో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ సమన్వయంతో భారత్‌లో 6 పరిశ్రమల్లో తయారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటికితోడు దేశీయ సంస్థలైన జైడస్‌ క్యాడిలా, బయోలాజికల్‌ ఈ, జెన్నోవాలు చేస్తోన్న వ్యాక్సిన్‌ అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తోంది. అంతేకాకుండా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న ముక్కు ద్వారా తీసుకునే సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌కు కేంద్రం నిధులు సమకూరుస్తోంది. రానున్న రోజుల్లో కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే ఇది గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంది.

అపోహ 4: లైసెన్సును తప్పనిసరి చేయాలి

వాస్తవంతప్పనిసరి లైసెన్సింగ్‌ మంచి ఎంపిక కాదు. ఎందుకంటే ఫార్ములా ఒక్కటే సమస్య కాదు కనుక. ఇందుకోసం భాగస్వామ్య సంస్థలు, సిబ్బంది శిక్షణ, ముడిపదార్థాల సేకరణతో పాటు అత్యంత ప్రధానమైన బయోసేఫ్టీ ల్యాబ్‌లు అవసరం అవుతాయి. ఇక సాంకేతిక బదిలీ ఆయా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఈ విషయంలో మేము ముందడుగు వేశాం. కొవాగ్జిన్‌ను మరో 3 సంస్థలతో తయారు చేయిస్తున్నాం. స్పుత్నిక్‌ విషయంలోనూ అదే జరిగింది. అందుకే లైసెన్సింగ్‌ అనేది ప్రాధాన్య విషయం కాదు.

అపోహ 5: కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలకు వదిలివేసింది..

వాస్తవం: దేశంలో వ్యాక్సిన్‌ సంస్థలకు నిధులు సమకూర్చడం దగ్గర నుంచి వేగవంతంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇక దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే వ్యాక్సిన్లు అందిస్తున్న విషయం ఆయా రాష్ట్రాలకు తెలుసు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సమస్యలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎదురయ్యే కష్టాలు కూడా రాష్ట్రాలకు తెలుసు. ఇలాంటి సమయంలో 3 నెలల్లో కనీసం ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, కొవిడ్‌ పోరులో ముందున్న వారికి వ్యాక్సిన్‌ పూర్తిచేయని రాష్ట్రాలు.. మిగతా వయసువారికి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఆరోగ్యం రాష్ట్రాల విషయం అయినప్పటికీ.. రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే వ్యాక్సిన్‌ విధానాన్ని సరళీకరించాం. దీంతో ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛ పెరిగింది. ఇక గ్లోబల్‌ టెండర్లు ఎలాంటి ఫలితాలు ఇవ్వవని.. మొదటి నుంచి రాష్ట్రాలకు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నామని పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో వాటిని స్వల్ప సమయంలో దిగుమతి చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు.

అపోహ 6: రాష్ట్రాలకు తగినంత వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వడం లేదు..

వాస్తవంరాష్ట్రాలకు వ్యాక్సిన్‌ డోసులను అందించడంలో కేంద్రం నిబంధనలు పాటించడంతోపాటు అత్యంత పారదర్శకత పాటిస్తోంది. వ్యాక్సిన్‌ లభ్యతపై రాష్ట్రాలకు ఎప్పటికప్పడు సమాచారం కూడా ఇస్తున్నాం. రానున్న రోజుల్లో వ్యాక్సిన్‌ లభ్యత గణనీయంగా పెరుగనుంది. కేంద్రప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రాలకు 25శాతం, ప్రైవేటుకు 25శాతం వ్యాక్సిన్లను నేరుగా తయారీ సంస్థ నుంచి సేకరించుకోవచ్చు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ ప్రజల్లో ఆందోళనలు ఏర్పడే విధంగా కొందరు నాయకులు వార్తా ఛానళ్లలో మాట్లాడడం దురదృష్టకరం. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. కరోనా పోరులో ప్రతిఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

అపోహ 7: చిన్నారులకు టీకాపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు

వాస్తవంఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎలాంటి సిఫార్సు చేయలేదు. చిన్నారుల్లో వ్యాక్సిన్లపై జరుగుతున్న ప్రయోగాల్లో సురక్షిత, సామర్థ్యంపై ఇప్పుడిప్పుడే ఆశాజనక ఫలితాలు వస్తున్నాయి. భారత్‌లోనూ చిన్నారులపై వ్యాక్సిన్‌ ప్రయోగాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.  ప్రయోగ ఫలితాలు వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు అనవసరంగా ఈ విషయాలను రాజకీయం చేస్తున్నారు.

ఇలా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. వ్యాక్సిన్ల తయారీ, దిగుమతి, పంపిణీపై నెలకొంటున్న అపోహలపై నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ వివరణ ఇచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని