NITI Aayog: మోదీ అధ్యక్షతన ‘నీతి ఆయోగ్‌’ సమావేశం ప్రారంభం.. కేసీఆర్‌, నీతీశ్‌ గైర్హాజరు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ (NITI Aayog) పాలక మండలి సమావేశం నేడు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రారంభమైంది.

Published : 07 Aug 2022 13:28 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ (NITI Aayog) పాలక మండలి సమావేశం నేడు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రారంభమైంది. ఇందులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు నేటి నీతి ఆయోగ్‌ సమావేశం ఎజెండాలో ఉన్నాయి.

అయితే, నీతి ఆయోగ్‌ ఏడో సమావేశంలో (NITI Aayog Meet) ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కీలక నేతలైన తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌లు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. జులై 2019లో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశం తర్వాత పాలకమండలి సభ్యులు మళ్లీ భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ భేటీని భౌతికంగా నిర్వహించలేదు.

ఇదిలాఉంటే, నీతీ ఆయోగ్‌ సమావేశంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ ప్రణాళిక మండలికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, దాని వల్ల ఎవరికీ మేలు జరగడం లేదని విమర్శించారు. నీతిఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నేడు దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కొవిడ్‌ బారినపడి ఇటీవలే కోలుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మాత్రం ఈ భేటీకి హాజరు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని