Nitin Gadkari: ‘మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కదు’: నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

పబ్లిసిటీ, పాపులారిటీ అవసరమే కానీ.. తమ నియోజకవర్గాల్లో చేసిన మంచి పనులే నేతలకు గౌరవాన్ని తెచ్చిపెడతాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) అభిప్రాయపడ్డారు. 

Updated : 07 Feb 2024 10:37 IST

ముంబయి: రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. వాటిని పట్టించుకోకుండా ఆ రోజున అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్లాలనుకుంటున్న రాజకీయ నాయకుల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. అలాగే మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘చర్చల్లో అభిప్రాయ భేదాలు ఉండటం ఇబ్బంది కాదు. తగిన ఆలోచన లేకపోవడమే అసలు సమస్య. కొందరు తమ సిద్ధాంతాల ఆధారంగా దృఢ నిశ్చయంతో ఉంటారు. అలా విలువలకు కట్టుబడే వారి సంఖ్య తగ్గిపోతోంది. భావజాలంలో క్షీణత కనిపిస్తోంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నాయకులు అప్పటికి అధికారంలో ఉన్న పార్టీతో అనుబంధం కొనసాగించాలనుకుంటారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రత్యేకత వల్లే మన పాలనా వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయ నాయకులు వస్తుంటారు..పోతుంటారు. పబ్లిసిటీ, పాపులారిటీ అవసరమే కానీ.. నేతలు తమ నియోజకవర్గాల్లో  చేసిన పనే వారికి వన్నె తెస్తుంది’ అని  గడ్కరీ(Nitin Gadkari) అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తనపై ప్రభావం చూపిన వ్యక్తుల గురించి వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ తర్వాత  రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ తీరు తనను ఆకట్టుకుందని గడ్కరీ(Nitin Gadkari) చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ వాక్చాతుర్యాన్ని కొనియాడారు. ఇటీవల భారతరత్న గౌరవం పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో మన ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని