Nitish Kumar: ‘అవసరమైతే.. మీ కాళ్లు మొక్కుతా’.. CM చర్యతో అధికారులు అవాక్కు!

ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధిని కోరిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌.. అందుకోసం అవసరమైతే పాదాలకు నమస్కరిస్తానంటూ చెప్పడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు.

Published : 11 Jul 2024 00:22 IST

పట్నా: బిహార్‌లో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అందుకోసం అవసరమైతే ఆయన పాదాలకు నమస్కరిస్తానంటూ సీఎం ముందుకు వెళ్లడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్‌ ఛౌదరీ, విజయ్‌కుమార్‌తో పాటు స్థానిక ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌లు అదే వేదికపై ఉన్నారు.

‘జేపీ గంగా పథ్‌’ ప్రాజెక్టులో భాగంగా పట్నాలోని గయా ఘాట్‌ నుంచి కంగన్‌ ఘాట్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి మూడో దశ పనులను ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై అధికారులు ఆయనకు వివరించారు. అయితే, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు.

2 గంటలు, 5189 రౌండ్ల కాల్పులు.. సైన్యం ప్రతిఘటనతో ఉగ్రవాదులు పరార్‌!

అదే సమయంలో అక్కడే ఉన్న నిర్మాణ సంస్థ ప్రతినిధిని ఉద్దేశిస్తూ.. ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం కోరారు. ‘‘కావాలంటే మీ పాదాలకు నమస్కరిస్తా. సకాలంలో పనులు పూర్తిచేయండి’’ అని సదరు సంస్థ ప్రతినిధిని అభ్యర్థించారు. అంతేకాకుండా మరింత ముందుకు వెళ్లి అతడి చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో కంగుతిన్న ఆ ప్రైవేటు సంస్థ ప్రతినిధి.. ‘సర్‌, అలా చేయకండి’ అంటూ వెనక్కి వెళ్లిపోయాడు. సీఎం తీరుతో వేదిక వద్ద ఉన్న నాయకులు, ఉన్నతాధికారులు ఒక్కసారిగా లేచి నిలబడి ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేశారు.

ఓ సీనియర్‌ ఐఏఎస్‌తోనూ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ ఇటీవల ఇలాగే ప్రవర్తించారు. సర్వేలు వేగవంతం చేసి భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ.. ఐఏఎస్‌ అధికారి కాళ్లు మొక్కుతానని పేర్కొన్నారు. తాజాగా అటువంటి ఘటనే మరోసారి చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని