Nitish Kumar: ‘హిందీని చంపేస్తారా’.. మండలి ఛైర్మన్‌పై నీతీశ్‌ ఆగ్రహం!

Nitish kumar: శాసనమండలిలో బోర్డుపై ఆంగ్ల అక్షరాలు చూసి బిహార్‌ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీని చంపేద్దామనుకుంటున్నారా అంటూ మండలి ఛైర్మన్‌పై అసహనం వ్యక్తంచేశారు.

Published : 21 Mar 2023 23:54 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) మరోసారి ఆంగ్ల భాష పట్ల తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తంచేశారు. శాసనమండలి సభ్యుడిగా సమావేశాలకు హాజరైన ఆయన.. అక్కడ ఉన్న బోర్డుపై ఆంగ్ల అక్షరాలు చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘హిందీని చంపేద్దామనుకుంటున్నారా’ అంటూ ఒకింత అసహనానికి లోనయ్యారు.  హిందీకి బదులు ఆంగ్లాన్ని ఎందుకు ప్రదర్శించారంటూ ఛైర్మన్‌ దేవేశ్‌ చంద్ర ఠాకూర్‌ను ప్రశ్నించారు. దాన్ని సరిచేస్తామని ఠాకూర్‌ చెప్పడంతో శాంతించారు. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఆంగ్ల భాష పట్ల నీతీశ్‌ ఈ తరహాలో విరుచుకుపడడం ఈ మధ్య కాలంలో రెండోసారి. ఇటీవల ఓ వేదికపై ఓ రైతు ఆంగ్లంలో మాట్లాడడంపైనా నీతీశ్‌ ఇలానే ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ప్లంబింగ్‌ మానేసి రైతుగా మారానని, అందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవే కారణమంటూ అతడు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పదే పదే ఆంగ్ల పదాలు ఉపయోగించడం పట్ల నీతీశ్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. రైతు ప్రసంగం మధ్యలోనే కలగజేసుకుని ఇది ‘ఇంగ్లాండ్‌ అనుకుంటున్నారా? ఇండియా అనుకుంటున్నారా? బిహార్లో ఉన్నప్పుడు హిందీనే మాట్లాడాలి. అయినా కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో స్మార్ట్‌ఫోన్‌కు అలవాటై చాలా మంది తమ సొంత భాషను మరిచిపోయారు’ అంటూ నీతీశ్‌ అసహనం వ్యక్తంచేశారు.

నీతీశ్‌ తాజా వ్యాఖ్యలపై భాజపా విమర్శలు గుప్పించింది. ‘‘ఆర్జేడీలో చేరిన తర్వాత అక్కడి పరిస్థితులకు ఇమడలేక నీతీశ్‌ ఇదిగో ఇలా విరుచుకుపడుతున్నారు’’ అంటూ ఆ పార్టీ నేత, మాజీ మంత్రి భాజపా నేత నీరజ్‌ సింగ్‌ బబ్లూ అన్నారు. ‘ఎర్రటి వస్త్రం చూడగానే పిచ్చెక్కిన ఎద్దులా ఉంది నీతీశ్‌ వాటం’’ అంటూ భాజపా అధికార ప్రతినిధి నిఖిల్‌ ఆనంద్‌ దుయ్యబట్టారు. మానసిక రోగంతో బాధపడుతున్నారని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని