Nitish kumar: మనం బ్రిటీష్‌ కాలంలో జీవించట్లేదు కదా.. ఆంగ్లంలో డిజిటల్‌ సైన్‌బోర్డ్‌ ఏర్పాటుపై మండిపడ్డ నీతీశ్‌

సైన్‌బోర్డ్‌పై ఆంగ్లంలో రాయడాన్ని బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ( Nitish Kumar) తీవ్రంగా తప్పుపట్టారు. 

Updated : 28 Sep 2023 11:08 IST

పట్నా: అందరికీ అర్థం కావాల్సిన వాటిపై ఆంగ్ల భాషలో రాయడాన్ని బిహార్‌ (Bihar)ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) తప్పు పట్టారు. ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడున్న సైన్‌బోర్డ్‌పై ఆంగ్ల (English)పదాలను చూసి మండిపడ్డారు. రాజధాని పట్నాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంకా జిల్లాలో సీఎం పర్యటన  సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది.

పర్యటనలో భాగం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ను నీతీశ్‌ సందర్శించారు. అక్కడున్న గ్రంథాలయం ముందు ‘డిజిటల్‌ లైబ్రరీ’ అని ఆంగ్లంలో రాసున్న బోర్డు ఆయన కంటపడింది.  దీంతో నీతీశ్‌ ఈ బోర్టు హిందీలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ‘మనం బ్రిటీష్‌ కాలంలో జీవించడం లేదు కదా’.. అని జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంగ్లంలో సంతకం పెట్టడమే మానేశా..

ఈ సందర్భంగా నీతీశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఆంగ్ల భాషకు వ్యతిరేకిని కాను. నా చదువంతా ఆ మాధ్యమంలోనే సాగింది. పార్లమెంట్‌లో జరిగిన చాలా సమావేశాల్లోనూ ఆంగ్లంలోనే మాట్లాడాను. కానీ, ఒకనొక సమయంలో నేను మాతృభాషను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నా. అందుకోసం నా సంతకాన్ని కూడా ఇంగ్లిష్‌లో పెట్టడడం మానేశా. దయచేసి ఈ బోర్టును త్వరగా మార్చండి’’ అని అదేశించారు.

వీసాలతో సిక్కు యువతకు ఎర

ఆంగ్ల భాషపై నీతీశ్‌ మండిపడటం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంను ఉద్దేశించి ఆంగ్లంలో ప్రసంగం ప్రారంభించిన వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర శాసన మండలిలో ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్ట్‌పై ప్రదర్శించిన ఆంగ్ల పదాలను చూసి సీఎం అగ్గిమీద గుగ్గిలమైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. జిల్లాలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని నీతీశ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఇటీవల పునర్నిర్మించిన ఇండోర్‌ స్టేడియంతో పాటు గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా జాముయ్‌లో దెబ్బతిన్న వంతెనను ఆయన పరిశీలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని