Nitish Kumar: మళ్లీ కలిశాం.. మళ్లీ సీబీఐ, ఈడీ వచ్చాయి..!: నీతీశ్‌ విమర్శలు

కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను వరుసగా ప్రశ్నిస్తూ, వారికి చెందిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించడాన్ని బిహార్(Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. 

Published : 11 Mar 2023 17:39 IST

దిల్లీ: ఉద్యోగాలకు భూముల కుంభకోణం(Land for jobs Case)కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ కుటుంబసభ్యుల్ని కేంద్రదర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ వరుసపెట్టి ప్రశ్నిస్తున్నాయి. వారికి చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav)కు సమన్లు ఇచ్చాయి. తాజాగా దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) స్పందించారు. 

‘2017లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవి. ఆ తర్వాత జేడీయూ,ఆర్జేడీ పార్టీలు వేర్వేరు మార్గాలు ఎంచుకున్నాయి. ఐదేళ్లు గడిచాయి. మళ్లీ కొద్దినెలల క్రితం మేం కలిసి ప్రభుత్వంలో ఉన్నాం. సోదాలు మొదలయ్యాయి. ఇంతకంటే నేనింక ఏం చెప్పగలను. గతంలో సమన్లు ఇచ్చారు. ఐదు సంవత్సరాల తర్వాత సోదాలు జరగుతున్నాయి. ఇప్పటివరకు ఏం గుర్తించారు..?’ అంటూ విపక్ష నేతలపై జరుగుతోన్న ఐటీ దాడులను ఉద్దేశించి జేడీయూ అగ్రనేత నీతీశ్‌(Nitish Kumar) విమర్శలు చేశారు. 

2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో ‘గ్రూప్‌-డి’ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. నాడు ఉద్యోగాలు పొందినవారు లాలూ, అతని కుటుంబసభ్యులకు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌ సంస్థకు భూములను (Land for jobs Case) లంచంగా ఇచ్చారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి లాలూను, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ఇటీవల ప్రశ్నించింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ.. శుక్రవారం దిల్లీ, బిహార్‌, ముంబయిలో మొత్తం 25 చోట్ల సోదాలు చేపట్టింది. తేజస్వీ నివాసంతో పాటు లాలూ కుమార్తెలు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని