Death Sentences: ఏడాదిలో 165 మరణ శిక్షలు.. రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికం!

దేశవ్యాప్తంగా ట్రయల్‌ కోర్టులు 2022లో ఆయా కేసుల్లో 165 మందికి మరణ శిక్ష విధించాయి. ఒకే ఏడాదిలో విధించిన మరణ శిక్షల సంఖ్య రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికం.

Published : 31 Jan 2023 00:10 IST

దిల్లీ: గతేడాది దేశవ్యాప్తంగా విచారణ కోర్టులు(Trail Courts) ఆయా కేసుల్లో 165 మందికి మరణ శిక్షలు(Death Sentences) విధించాయి. 2000వ సంవత్సరం తర్వాత ఒక ఏడాదిలో ఇన్ని మరణ శిక్షలు విధించడం ఇదే మొదటిసారి. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాని(NLU)కి చెందిన ‘ప్రాజెక్టు 39ఏ’ విడుదల చేసిన ‘భారత్‌లో మరణ శిక్షలు, వార్షిక గణాంకాల నివేదిక 2022’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మరణ శిక్ష ఖైదీల సంఖ్య 2022 చివరి నాటికి 539కి చేరుకుంది. 2016 నుంచి ఇదే అత్యధికం. మరణ శిక్ష ఖైదీల సంఖ్య సైతం 2015 నుంచి 2022 నాటికి 40 శాతం పెరిగింది.

మరణ శిక్ష విధించిన 50 శాతానికిపైగా(51.28 శాతం) కేసులు లైంగిక నేరాలకు సంబంధించినవేనని నివేదిక పేర్కొంది. అహ్మదాబాద్‌ బాంబు పేలుడు కేసులో 38 మందికి మరణ శిక్ష విధించడం.. 2022లో అత్యధిక మరణ శిక్షల సంఖ్యకు కారణమైంది. 2016 నుంచి ఒకే కేసులో అత్యధిక సంఖ్యలో మరణ శిక్షలు పడింది కూడా ఇందులోనేనని రిపోర్టు తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 100 మంది మరణ శిక్ష పడిన ఖైదీలు ఉన్నారు. గుజరాత్ (61), ఝార్ఖండ్ (46), మహారాష్ట్ర (39), మధ్యప్రదేశ్ (31) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

మరణ శిక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు 11 కేసులు, హైకోర్టులు 68 కేసులను పునర్వివిచారణ చేపట్టాయి. 15 మంది ఖైదీలతో సంబంధం ఉన్న 11 కేసుల్లో సుప్రీం కోర్టు.. ఐదుగురిని అన్ని అభియోగాల నుంచి విముక్తి చేసింది. ఎనిమిది మంది శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇద్దరికి మరణ శిక్షను నిర్ధారించింది. 101 మంది ఖైదీలతో కూడిన 68 కేసుల్లో హైకోర్టులు.. ముగ్గురికి మరణశిక్షను సమర్థించాయి. 48 మంది శిక్షను జీవిత ఖైదుగా మార్చాయి. 43 మందిని నిర్దోషులుగా ప్రకటించాయి. ఆరుగురి కేసులను ట్రయల్ కోర్టుకు తిప్పిపంపాయి’ అని నివేదిక తెలిపింది. బాంబే హైకోర్టు.. ఓ దోపిడీ, హత్య కేసులో ఒక ఖైదీ శిక్షను జీవిత ఖైదు నుంచి మరణ శిక్షను పెంచిందని, 2016 తర్వాత శిక్ష పెంపుదలకు సంబంధించి ఇది రెండో కేసు అని నివేదిక వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని