Parliament: లోక్‌సభలో 20 నిమిషాల పాటు మూగబోయిన మైకులు!

లోక్‌సభ (LokSabha) కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఆడియో పని చేయలేదు. ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేసేందుకే అధికార భాజపా ఈ చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Published : 17 Mar 2023 18:58 IST

దిల్లీ: లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతి పక్షాల గొంతు వినిపించకుండా అధికార పక్షం మైకులను ఆఫ్‌ చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌.. తాజాగా సభా కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియకుండా ఆడియోను నిలిపివేసిందంటూ విమర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. అయితే, కాంగ్రెస్‌ వ్యాఖ్యలను భాజపా కొట్టిపారేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని, సాంకేతిక తప్పిదం వల్లే ఆడియో నిలిచిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రతిరోజూ సభ కార్యకలాపాలను యథాతథంగా ప్రసారం చేస్తున్నామని, గతంలో సభను ప్రతిపక్షం అడ్డుకున్నప్పడు వారి నినాదాలు కూడా ఆడియోలో వినిపించాయని గుర్తు చేసింది.

ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన తర్వాత అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్‌లోకి దూసుకొచ్చి స్పీకర్‌ ఓం బిర్లా ఎదుట ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి కొద్దిసేపటికే ఆడియో వినిపించలేదు. దాదాపు 20 నిమిషాలపాటు ఇదే పరిస్థితి. ఆ తర్వాత సభ్యులంతా నిశ్శబ్దంగా ఉండాలని స్పీకర్‌ చెప్పినప్పుడే ఆడియో తిరిగి వచ్చింది. ఆ వెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

లోక్‌సభలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు గతంలో మైకులు నిలిపేశారు. మోదీ స్నేహితుడి కోసం ఇప్పుడు సభా కార్యక్రమాలనే సైలెంట్‌ చేశారు’’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేసింది. జేపీసీని ఏర్పాటు చేయమన్నందుకే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.  అంతేకాకుండా తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని లోక్‌సభలో ప్రసంగించకుండా అడ్డుకునేందుకు భాజపా కుయుక్తులు పన్నుతోందని ఆరోపించింది. రాహుల్‌ గాంధీ లండన్‌ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేంత వరకు ఆయనకు లోక్‌సభలో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకూడదని భాజపా భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక్క రోజు కూడా సమావేశాలు సజావుగా సాగలేదు. రాహుల్‌ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అధికార భాజపా డిమాండ్‌ చేస్తోంది. రాహుల్‌ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజిజు తదితర కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అదానీ వ్యవహారంలో జేపీసీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం రివాజుగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని