Additional Dose: ‘అదనపు డోసు’పై కుదరని ఏకాభిప్రాయం..!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలో ఉన్నప్పటికీ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మూడో డోసు ఇచ్చే

Published : 07 Dec 2021 11:29 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలో ఉన్నప్పటికీ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మూడో డోసు ఇచ్చే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సోమవారం సుదీర్ఘంగా సమావేశమైంది. అయితే ఈ భేటీలో అదనపు డోసుపై ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు నేడు వెల్లడించాయి. ఇక పిల్లలకు టీకాపై కూడా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొన్నాయి.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, అదనపు డోసులు, పిల్లలకు టీకాపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) భేటీ అయ్యింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే బాధితులకు అదనపు డోసు అందించే అంశమే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికైతే మూడో డోసుపై కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయలేదని సదరు వర్గాలు తెలిపాయి. కాగా.. పిల్లలకు టీకాపై త్వరలోనే ఓ విధానాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో.. దేశంలో బూస్టర్‌ డోసు పంపిణీపై పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా కొవిషీల్డ్‌ను బూస్టర్‌గా గుర్తించాలని ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. ఇలా బూస్టర్‌ డోసుపై డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర నిపుణుల బృందం మాత్రం బూస్టర్‌ డోసు వైపు కాకుండా అదనపు డోసుపై దృష్టి పెట్టామని చెప్పింది. బూస్టర్‌, అదనపు డోసులను వేర్వేరుగా పేర్కొన్న నిపుణుల బృందం.. రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ నుంచి ఎటువంటి రక్షణ కలగని వారికి ఇచ్చే మూడో డోసును ‘అదనపు డోసు’గా పరిగణిస్తామని పేర్కొంది. ఇక రెండు డోసులు తీసుకున్న కొంతకాలానికి రోగనిరోధక స్పందనలు తగ్గితే.. అటువంటి వారికి మరికొంత వ్యవధి తర్వాత ఇచ్చే డోసును బూస్టర్‌ డోసుగా పరిగణిస్తామని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. 40 ఏళ్లు దాటినవారికి బూస్టర్‌ డోసు అందించే అవకాశాలను పరిశీలించొచ్చని ఇటీవల కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్‌) కీలక సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని