Lok Sabha: డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే నాలుగేళ్లుగా సభ.. కాంగ్రెస్‌ విమర్శలు

లోక్‌సభ (Lok Sabha)లో డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker)ను ఎన్నుకోకుండా కేంద్రం నాలుగేళ్లుగా రాజ్యాంగ విరుద్ధంగా సభ నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ (Congress) పార్టీ విమర్శించింది. 

Published : 06 Mar 2023 01:02 IST

దిల్లీ: లోక్‌సభ (Lok Sabha)లో డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker)ను ఎన్నుకోకుండా మోదీ సర్కార్‌ నాలుగేళ్ల పాటు పార్లమెంట్‌ (Parliament) సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌ (Congress) పార్టీ విమర్శించింది. గత నెలలో లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు  (Supreme Court) కేంద్రం తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పదవి ఇది ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ (Jairam Ramesh) మరోసారి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపై అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు గుప్పించారు.

‘‘నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధం. 1956లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తనపై తరచూ విమర్శలు చేసే ప్రతిపక్ష అకాలీ దళ్‌ పార్టీ ఎంపీ సర్దార్‌ హుకమ్‌ సింగ్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ప్రతిపాదిస్తే.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్టికల్‌ 93 ప్రకారం సభలోని సభ్యులు తమలోంచి ఇద్దరు వ్యక్తులను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోవాలి. చాలా అరుదుగా ఈ పదవులు ఖాళీగా ఉంటాయి’’ అని జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఎన్‌డీయే-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగానే ఉంది. చివరిగా 2019 మే వరకు ఏఐడీఎంకే పార్టీ నుంచి ఎమ్‌. తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1952లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఎక్కువ కాలం డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు