Farmers protest: పోలీసు చర్యల్లో రైతులెవరూ చనిపోలేదు: కేంద్రం

ఏడాదికిపైగా కొనసాగిన రైతు ఉద్యమం గురువారంతో ముగిసింది. సాగుచట్టాలను రద్దు చేయడంతోపాటు మరికొన్ని డిమాండ్లనూ నెరవేరుస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఉద్యమాన్ని తాత్కాలికంగా ముగించి తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 700కుపైగా రైతులు

Published : 10 Dec 2021 23:40 IST

దిల్లీ: ఏడాదికిపైగా కొనసాగిన రైతు ఉద్యమం గురువారంతో ముగిసింది. సాగుచట్టాలను రద్దు చేయడంతోపాటు మరికొన్ని డిమాండ్లనూ నెరవేరుస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఉద్యమాన్ని తాత్కాలికంగా ముగించి తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 700కుపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతులు కోరుతుండగా దీనిపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇదే విషయంపై రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. దీనికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమాధానం ఇచ్చారు.

‘‘రైతుల ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం.. ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు, ప్రతిపాదనలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. ఉద్యమం సమయంలో పోలీసుల తీసుకున్న చర్యల్లో రైతులెవరూ మరణించలేదు’’అని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు సంబంధించిన మరో ప్రశ్నకు ‘‘కనీస మద్దతు ధరలో పారదర్శకత, జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి ప్రోత్సాహం, దేశ అవసరాలకు తగ్గట్టు సాగులో మార్పులు తీసుకొచ్చేందుకు ఒక కమిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నాం’’అని కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

శిబిరాలు ఖాళీ చేస్తున్న రైతులు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఏడాది పాటు సాగిన ఆందోళనలు ముగియడంతో రైతులు తమ శిబిరాలను ఖాళీ చేస్తున్నారు. దిల్లీలోని సింఘు, టిక్రీ వద్ద శిబిరాల తొలగింపు అనధికారికంగా గురువారమే ప్రారంభం కాగా.. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు రైతులు గుడారాలను తొలగించి, తమ సామగ్రిని స్వస్థలాలకు తరలిస్తున్నారు. మరికొందరు రైతులు అక్కడే ఉన్నారు. ట్రక్కులు, జీపుల్లో సామగ్రితో రైతులు తరలిపోతుండటంతో ఆయా రహదారుల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. సాగు చట్టాల రద్దు సహా తాము లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ అందడంతో రైతు సంఘాలు తమ ఆందోళనను ముగిస్తున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని