రైతుల ఆందోళన: చర్చలపై నో కమిటీ!

సాగు చట్టాలపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు 9మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది.

Updated : 09 Mar 2021 19:33 IST

సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడి

దిల్లీ: సాగు చట్టాలపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు 9మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నూతన వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు పర్యటిస్తామని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయద్దని ప్రచారం చేస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతోన్న ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 280మందికి పైగా రైతులు బలిదానం చేశారని సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడించింది. మంగళవారం నాడు టిక్రీ సరిహద్దులో మరో రైతు(50) ప్రాణాలు కోల్పోయారని ఎస్‌కేఎం తెలిపింది.

ఇదిలాఉంటే, సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు రైతుల సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటివరకు 11దఫాలుగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఏడాదిన్నర పాటు నూతన సాగు చట్టాల అమలును నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై రైతు సంఘాలు స్పందించకపోవడంతోనే చర్చల్లో పురోగతి కనిపించడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు