Updated : 23 Jan 2021 20:10 IST

దేశానికి బెంగాల్‌ అమూల్య సంపదనిచ్చింది: మోదీ

కోల్‌కతా: బెంగాల్‌ భూమి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సహా ఎంతో మంది మహోన్నత వ్యక్తులను దేశానికి అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా శనివారం కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ కూడా హాజరయ్యారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకంగా స్టాంపు, నాణెంను విడుదల చేస్తూ.. ప్రతిఏటా ఆయన జన్మదినాన్ని పరాక్రమ్‌ దివస్‌గానే జరుపుకొంటామని మోదీ స్పష్టం చేశారు. దేశాన్ని ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’గా తీర్చిదిద్దే క్రమంలో 130కోట్ల మంది భారతీయులను ఏ శక్తీ ఆపలేదని మోదీ స్పష్టం చేశారు. 

‘దేశానికి స్వాతంత్ర్యం కల్పించేందుకు నేతాజీ చేసిన త్యాగాలు మరువలేనిది. కాబట్టి ప్రతి భారతీయుడు ఆయనకు రుణపడి ఉంటాడు. ప్రపంచ దేశాల ముందు నేడు భారత్‌ను ఆయన గర్వించే విధంగా చేశారు. నేతాజీ దృఢమైన భారత్‌ గురించి కలలు కన్నారు. ఆయన కలలు కన్న మార్గంలో నేడు ఎల్‌ఏసీ నుంచి ఎల్‌ఓసీ వరకు పటిష్ఠంగా తయారైంది. ఈ రోజు నిర్మితమైన ఈ కొత్త భారతదేశాన్ని చూస్తే ఆయన భావన ఎలా ఉండేదోనని తలచుకుని నేను ఆశ్చర్యపోతుంటా. ప్రపంచం మహిళల ప్రాథమిక హక్కుల గురించి చర్చిస్తున్న సమయంలోనే.. నేతాజీ భారత్‌లో ఝాన్సీ రాణి పేరుతో వీరనారీమణులతో స్వాతంత్ర్య సంగ్రామం కోసం రెజిమెంట్‌ను తయారు చేశారు. వారికి శిక్షణ ఇచ్చి దేశం కోసం పాటు పడేలా తయారు చేశారు’ అని మోదీ ఆయన సేవల్ని కొనియాడారు. 

బెంగాల్‌ గురించి మాట్లాడుతూ.. ఈ భూమి దేశానికి అన్ని రంగాల్లో వెలకట్టలేని సంపదను ఇచ్చిందన్నారు. ‘నేతాజీ వంటి మహోన్నత వ్యక్తిని కన్న ఈ నేలకు నేను వందనాలు చేస్తున్నా. ఆయన దేశంలోని ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమే. ఆయన త్యాగాల్ని, సేవల్ని గుర్తుపెట్టుకోవడం మన విధి. మన దేశానికి జాతీయ గీతాన్ని అందించింది కూడా ఈ భూమే’ అని మోదీ పేర్కొన్నారు. దేశంతో పాటు బెంగాల్‌ను ‘సోనార్‌ బంగ్లా’గా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఇదీ చదవండి

పిలిచి అవమానించారు.. మాట్లాడను: మమత

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts