Delhi: మరిన్ని కఠిన ఆంక్షల దిశగా దిల్లీ.. రెస్టారంట్లు మూసివేత..?

దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోన్న దిల్లీ సర్కారు.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని

Published : 10 Jan 2022 15:51 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోన్న దిల్లీ సర్కారు.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. కరోనా పరిస్థితులపై దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) సోమవారం మరోసారి సమావేశమైంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనాను కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతానికి దిల్లీలో లాక్‌డౌన్‌ అవసరం లేదని, అయితే మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తాజా ఆంక్షల్లో భాగంగా రెస్టారంట్లలో డైన్‌-ఇన్‌ సదుపాయంపై నిషేధం విధించే అవకాశమున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. హోటళ్లు, రెస్టారంట్లు 50శాతం సామర్థ్యంతో నడుపుకునేందుకు అనుమతి ఉంది. అయితే కూర్చుని తినే సదుపాయాన్ని నిషేధించి.. కేవలం హోం డెలివరీలు, టేక్‌అవేలకు అనుమతి ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఇక బస్సులు, మెట్రోల్లోనూ సామర్థ్యాన్ని తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రైవేటు ఆఫీసుల్లో 100శాతం వర్క్‌ ఫ్రమ్‌ హోంను అమలు చేయాలని ఆదేశించే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. 

1000 మంది పోలీసులకు పాజిటివ్‌..

దేశ రాజధానిలో పోలీసులపై కరోనా కొమ్ములు విదిలిస్తోంది. ఇటీవల కాలంలో అక్కడ దాదాపు వెయ్యి మంది పోలీసులు వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో అదనపు సీపీ(క్రైం బ్రాంచ్‌) కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌లో ఉన్నారని, వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరుతారని దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తితో దిల్లీలో గత కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 22,715 మంది వైరస్‌ బారినపడగా.. పాజిటివిటీ రేటు 23.53శాతానికి చేరి ఆందోళనకరంగా మారింది. ఇదే సమయంలో మరణాలు కూడా పెరగుతుండటం కలవరపెడుతోంది. నిన్న దిల్లీలో 17 మంది కరోనాతో మృతిచెందారు. గతేడాది జూన్‌ 13 తర్వాత ఒక రోజు ఇన్ని మరణాలు చోటుచేసుకోవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని