Coal Shortage: బొగ్గు నిల్వలపై ఆందోళన వద్దు.. సరఫరా పెంచుతున్నాం

దేశంలోని పలు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో విద్యుత్‌ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి

Updated : 12 Oct 2021 17:21 IST

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడి

దిల్లీ: దేశంలోని పలు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో విద్యుత్‌ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. బొగ్గు నిల్వలపై ఆందోళన చెందవద్దని అన్నారు. డిమాండ్‌కు సరిపడా బొగ్గు సరఫరాను పెంచుతున్నామని తెలిపారు. సోమవారం రికార్డు స్థాయిలో బొగ్గును సరఫరా చేసినట్లు చెప్పారు. 

‘‘సోమవారం 1.95 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేశాం. ఇప్పటివరకు ఇదే రికార్డు. ప్రస్తుతం కోల్ ఇండియా లిమిటెడ్‌ వద్ద 22 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీలైనంత వేగంగా బొగ్గు సరఫరాను మరింత పెంచుతాం. అక్టోబరు 21 తర్వాత నుంచి రోజుకు 2 మిలియన్‌ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. భారీ వర్షాలు, అంతర్జాతీయ ధరల కారణంగానే దేశంలో బొగ్గు కొరత సమస్య తలెత్తింది. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బొగ్గు నిల్వలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. వర్షాకాలం తర్వాత సరఫరాను మరింత పెంచేలా చూసుకుంటాం. ప్రజలెవరూ కంగారు పడాల్సిన పనిలేదు. డిమాండ్‌కు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తున్నాం’’ అని ప్రహ్లాద్‌ జోషీ చెప్పుకొచ్చారు.

మరోవైపు దేశంలో బొగ్గు నిల్వల పరిస్థితిపై ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. నిన్న ప్రహ్లాద్‌ జోషీ, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సమావేశమై బొగ్గు కొరతపై ఆరా తీసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం రావొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు లోడ్‌ సర్దుబాటులో భాగంగా కరెంట్ కోతలు చేపడుతోంది. దీంతో స్పందించిన కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సూచించింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. దాన్ని కరెంట్ అవసరమున్న రాష్ట్రాలకు ఇవ్వాలని కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని