Corona: దేశంలో మళ్లీ కొవిడ్‌ గ్రాఫ్‌ పైకి.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?

దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటక, హరియాణాల్లో కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో.....

Published : 12 Jun 2022 02:03 IST

దిల్లీ: దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటక, హరియాణాల్లో కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ పైకి ఎగబాకుతోంది. ఇప్పటివరకు క్రియాశీల కేసుల సంఖ్య 40వేల మార్కును దాటింది. అయితే, కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు వైద్యరంగ నిపుణులు. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌లేవీ మన దేశంలో లేవని.. కేసుల పెరుగుదల కూడా కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైనట్టు చెబుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు సరిగా పాటించకపోవడం, బూస్టర్‌ డోసులు తీసుకోకపోవడం వంటివి ప్రజల్లో ఇన్ఫెక్షన్‌ పెరుగుదలకు కారణం కావొచ్చని విశ్లేషిస్తున్నారు. 

భయాందోళన అవసరం లేదు.. ఎస్‌కే అరోడా
‘‘దేశంలో ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌ ఏమీ లేదు. ప్రస్తుతం బీఏ 2కు తోడు బీఏ 4, బీఏ 5 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు ఉన్నాయి. ఒమిక్రాన్‌ ఇతర సబ్‌ వేరియంట్లతో పోలిస్తే వీటి వ్యాప్తి కాస్త ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితికి తోడు వేసవి సెలవులతో ప్రజల కదలికలు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించడం వంటి కారణాల రీత్యా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కొందరు వ్యక్తులకు వైరస్‌ సోకుతోంది. ఎక్కువ జనసాంద్రత కలిగిన భారీ, మెట్రో నగరాల్లోనే ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌ పెరుగుదల పరిమితమైంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఇటీవల కాలంలో కొవిడ్‌ సోకుతున్న చాలా మందిలో సాధారణ జలుబు, తేలికపాటి అనారోగ్యానికే గురవుతున్నారు. అందువల్ల ఎలాంటి భయం అవసరంలేదు. కానీ కరోనా మన చుట్టూ ఉందనేది గమనంలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జన సమూహాలకు దూరంగా ఉండాలి. మన రోజువారీ జీవితంలో మాస్కులు ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి’’ అని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూపు ఆఫ్‌ ఇమ్యునైజేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌ కే అరోడా సూచించారు.

కొవిడ్‌ నిబంధనల పట్ల అలసత్వం పనికిరాదు: గులేరియా
‘‘కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు, మరణాల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. ఈ పెరుగుదల కొన్ని భౌగోళిక ప్రాంతాలకే పరిమితంగా ఉంది. కేసులు పెరుగుతుండటంతో  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే కొవిడ్‌ నిబంధనలను పాటించడంతో పాటు కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా భారీగా పరీక్షలు చేయించడంపై దృష్టిపెట్టాలి. కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం పనికిరాదని.. బూస్టర్‌ డోసు వేసుకోవాలి’’  అని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

టీకాలు వేయించుకోవాలి.. ఐసీఎంఆర్‌
కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఐసీఎంఆర్‌ ప్రతినిధి డాక్టర్‌ నివేదిత గుప్తా హెచ్చరించారు. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని (ప్రికాషన్‌ డోసుతో సహా) సూచించారు. టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్‌ తీవ్రత తగ్గడంతో పాటు ఆస్పత్రి చేరికలను నివారించవచ్చన్నారు. తాజాగా కొవిడ్‌ కేసుల పెరుగుదల కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నా.. వాటికి సమర్థంగా కట్టడి చేసేందుకు తగిన చర్యలు అవసరమని సూచించారు. 

పాజిటివిటీ రేటు పెరుగుతున్న 10 రాష్ట్రాలివే..
మరోవైపు, శనివారం దేశవ్యాప్తంగా 8,329 కొత్త కేసులు వచ్చాయి. పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో (కేరళ, మిజోరం, గోవా, మహారాష్ట్ర, దిల్లీ, హరియాణా, సిక్కిం, చండీగఢ్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌) పాజిటివిటీ రేటు పెరుగుతోంది. . దేశంలోని 17 జిల్లాల్లో వీక్లీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా ఉండగా.. ఆ జాబితాలో కేరళలో ఏడు జిల్లాలు, మిజోరంలో 10 జిల్లాలు ఉన్నాయి. అలాగే, 24 జిల్లాల్లో 5 నుంచి 10శాతం మధ్య కొవిడ్ వీక్లీ పాజిటివిటీ రేటు ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. వీటిలో కేరళలోనే ఏడు జిల్లాలు ఉండగా.. మిజోరం, మహారాష్ట్రలలో నాలుగు చొప్పున ఉన్నాయి. ప్రస్తుతం ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో (కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, హరియాణా, తమిళనాడు) 1000 కన్నా ఎక్కువగా క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని